‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా ప్రీమియర్ల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చిన సమయంలో జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ విషయంలో తప్పెవరిది అనే విషయంలో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది.
దానికి ఎక్స్‌టెన్షన్‌గా అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పేర్కొంటూ అరెస్టు చేశారు. వివిధ పరిణామాల తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీమ్.. పోలీసుల మధ్య సమాచార బట్వాడా జరగలేదు అని విమర్శలు వచ్చాయి. కుటుంబంతో సహా బన్నీ వస్తున్నాడని తెలిసినా సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదని ఫ్యాన్స్, సన్నిహితులు అంటుంటే.. అసలు రావొద్దనే చెప్పాము అని పోలీసుల వైపు నుండి సమాచారం వచ్చింది.
ఇప్పుడు పోలీసుల వాదనకు సపోర్టు చేసేలా ఓ ఆధారం బయటకు వచ్చింది. దాని బట్టి చూస్తే బన్నీని థియేటర్‌కు రప్పించొద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యాన్ని ముందే హెచ్చరించారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు రాసిన లేఖ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అందులో థియేటర్ యాజమాన్యం రిసీవ్డ్ సంతకం కూడా ఉంది. అందులో ఉన్న వివరాల ప్రకారం అయితే అల్లు అర్జున్ అండ్ టీమ్‌ని థియేటర్‌కు రావొద్దని చెప్పండి..
రద్దీ ప్రాంతం కావడం వల్ల ఇబ్బందులు వస్తాయని పోలీసులు చెప్పారు. అయితే దీనిని పట్టించుకోకుండా బన్నీ థియేటర్‌కు రావడమే కాకుండా.. ర్యాలీ తరహాలో కారు రూఫ్‌టాప్ ఓపెన్ చేసి మరీ అభివాదం చేశారు. రిటర్న్ వెళ్లినప్పుడు కూడా ఇంచుమించు ఇలానే జరిగింది. దీంతో ఈ విషయంలో బన్నీదే తప్పు అని అంటున్నారు. మరి కోర్టులో ఈ విషయం ఎలా కొలిక్కి వస్తుందో చూడాలి.