సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ (Coolie) సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. లోకేష్ గత చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించిన నేపథ్యంలో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా మారింది. రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు సినిమాపై సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా, ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, లోకేష్ కనగరాజ్, సందీప్ కిషన్‌ల (Sundeep Kishan) మధ్య ఉన్న స్నేహం కారణంగా ఇది జరిగిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లోకేష్ మొదటి సినిమా ‘మానగరం’ లో హీరోగా సందీప్ కిషన్ నటించగా, ఆ సినిమాతో అతనికి తమిళ్‌లో మంచి గుర్తింపు దక్కింది. ఆ అనుబంధం వల్లే ఈ ప్రాజెక్ట్‌లో అతనికి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున (Nagarjuna) , ఉపేంద్ర (Upendra), సోబిన్ షాహిర్‌ల వంటి స్టార్ కాస్ట్‌తో ‘కూలీ’ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.
ఇక సందీప్ కిషన్ జాయిన్ అవ్వడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. ఇటీవలే ధనుష్ (Dhanush) దర్శకత్వంలో రూపొందిన ‘రాయన్’లో (Raayan) కీలక పాత్ర పోషించిన సందీప్ తరువాత నుంచి హీరో పాత్రలపై మాత్రమే దృష్టి పెడతానని చెప్పాడు. అయితే, లోకేష్ వంటి దర్శకుడు అడిగినప్పుడు, అతను మళ్లీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘కూలీ’ సినిమా రజనీకాంత్ కెరీర్ లోనే అత్యంత కీలకంగా మారింది. వేట్టయాన్ చిత్రం నిరాశపరిచిన తరువాత, ఈ సినిమాపై ఒత్తిడి ఉంది.
మరోవైపు, లోకేష్ యూనివర్స్ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ నుంచి సందీప్ కిషన్ కూలీ టీమ్ ల్ చేరడం, తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో సందీప్ కిషన్ తన టాలెంట్‌ను మరింత ప్రూవ్ చేసుకోవడంతో పాటు, తమిళ్ మార్కెట్‌లో తనను మరోసారి నిలబెట్టుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.