అందం, అభినయం, అమాయకత్వం, గ్లామర్ షో.. ఇలా అన్నీ ఉన్నా వాటి మిక్సింగ్‌లో ఎక్కడో ఏదో సమస్య వచ్చి స్టార్ హీరోయిన్ అవుతూ అవుతూ మధ్యలోనే ఆగిపోయింది అను ఇమ్మాన్యుయేల్. అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేసే అవకాశం వచ్చినా వెనుకడుగు వేసేసింది. అయితే ఇప్పుడు కెరీర్ విషయంలో పక్కా క్లారిటీతో ఉంది అనేలా మాట్లాడుతోంది. మంచి కథని ఎంచుకోవడం, ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంది అని చెబుతోంది అను ఇమ్మానుయేల్.
అంతేకాదు చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ, నటిగా తానెప్పుడూ ఓడిపోలేదు అని కూడా చెబుతోంది. తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో ఆడిపాడిన అను ఇమ్మానుయేల్…. ఈమధ్య ఆచితూచి సినిమాలు చేస్తోంది. అల్లు శిరీష్‌తో కలసి ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో నటించింది అను. ఈ చిత్రం నవంబరు 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అను మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సినిమా అవకాశం వచ్చిందంటే సహజంగానే హీరో ఎవరు? ఇతర నటులు, నిర్మాణ సంస్థ లాంటి విషయాల గురించి హీరోయిన్లు ఆరా తీస్తుంటారు. అయితే మూడేళ్లుగా సినిమా రంగంలో మార్పులొచ్చాయి. ప్రేక్షకులకు హీరో ఎవరనే విషయం కంటే, కథే ఎక్కువ ప్రాధాన్యంగా మారింది. కథ బాగుంటే మిగతా విషయాల్ని పట్టించుకోవడం లేదు. దాంతోపాటు నా సినిమాల ఫలితాల్ని చూశాక నటిగా నేనూ కథల ఎంపిక శైలి మార్చుకున్నా అని చెప్పింది అను.
అందుకే మూస కథలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా దగ్గరికొచ్చిన పాత్రకు సరిపోతానా లేదా అని చూస్తున్నాను. ఆ పాత్ర నాకు సరిపోతుందా అని అనుకుని, కాదనిపిస్తే వెంటనే నో చెప్పేస్తున్నాను. ఖాళీగా ఇంట్లో కూర్చోవడానికి రెడీగా ఉన్నాను కానీ.. ఏదో ఒకటి చేసేద్దాం అని మాత్రం తొందరపడటం లేదు అని కెరీర్ స్ట్రాటజీ క్లారిటీ ఇచ్చేసింది. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా కథ, అందులోని నా పాత్రతోపాటు నిర్మాత అల్లు అరవింద్ మాటలే నన్ను ఈ సినిమా చేయడానికి ప్రేరేపించాయి అని చెప్పింది అను ఇమ్మాన్యుయేల్.