చేసిన సినిమా విడుదలవ్వాలని నటీనటులంతా కోరుకుంటారు. వీలైనంత త్వరగా తమ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటారు. అయితే కొన్నిసార్లు చిత్రాలు ఆలస్యంగా తెరపైకి రావడం వల్లే మంచే జరుగుతుంది. ఈ విషయానికి తనే మంచి ఉదాహారణ అంటోంది అందాల తార అనూ ఇమ్మాన్యూయేల్. ఈ భామ తొలి చిత్రం “ఆక్సీజన్” చాలా ఆలస్యంగా విడుదలైంది. ఆ తర్వాత ఒప్పుకుని నాని సరసన నటించిన “మజ్ను” తొలి చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఫర్వాలేదనే విజయాన్ని సాధించడంతో అనూ తలరాత మారిపోయింది. అదే ఆక్సీజన్ తొలి చిత్రమై ఉంటే ఈ నాయిక కథ మరోలా ఉండేది. అనూ ఆమధ్య ఇదే విషయాన్ని చెప్పుకుంది. చిత్రంలో పూర్తి ప్రయత్నంతో నటించడం వరకే తమ బాధ్యతను, జయాపజయాలను నిర్ణయించలేమని చెప్పుకుంది.
నా తొలి చిత్రం ఆక్సీజన్ అనుకున్నట్లు విడుదలై ఉంటే నా పరిస్థితి మరోలా ఉండేది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్‌లతో సినిమాలు దక్కేవి కావు. పవర్‌స్టార్‌తో అజ్ఞాతవాసి లాంటి సినిమాలో అవకాశం వస్తే ఎలా కాదనుకుంటాను. ఆ సినిమా ఫలితం ఏదైనా దాన్ని మేం ఆపలేం. ప్రతి సినిమా విడుదల సమయంలో పరీక్ష రాసి ఫలితం కోసం వేచి చూస్తున్నట్లు ఉంటుంది అని చెప్పుకొచ్చింది అను ఎమ్మాన్యూల్. ఇటీవలే “శైలజారెడ్డి అల్లుడు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కేరళ సుందరి, ప్రస్తుతం నాగార్జున, ధనుష్ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తోంది.