97వ ఆస్కార్ అవార్డుల వేడుకల నామినేషన్స్‌ను అకాడెమీ అవార్డ్స్ టీమ్ అనౌన్స్ చేసిందది. లాస్ ఏంజిలెస్‌లో వరుస కార్చిచ్చుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న నామినేషన్ల అనౌన్స్‌మెంట్‌ను ఇటీవల వెల్లడించారు. మార్చి 2న జరగనున్న ఈ పురస్కార వేడుకలో ఈసారి భారతీయ సినిమా కానీ, అందులోని పాట కానీ లేవు. అయితే ఓ షార్ట్ ఫిల్మ్ ఆ లిస్ట్‌లో చోటు సంపాదించింది. అదే ‘అనూజ’ (Anuja). ఆడమ్ జే గ్రేవ్స్ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్ విభాగంలో బరిలో నిలిచింది.
Anuja
గునీత్ మోంగా (Guneet Monga) నిర్మించిన ఈ సినిమాకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అనూజ అనే తొమ్మిదేళ్ల అమ్మాయి జీవితం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ అమ్మాయి సమాజంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందనే అంశాలను ఈ లఘు చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. అది నచ్చే ఆస్కార్ టీమ్ ఇప్పుడు నామినేషన్స్‌లో పెట్టింది. ‘అనూజ’లో (Anuja) టైటిల్ రోల్ కనిపించిన అమ్మాయి పేరు సజ్దా పఠాన్.
అనన్య షాన్‌బాగ్, నగేశ్ భోంశ్లే ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్‌గా దీనిని ఆడమ్ జే. గ్రేవ్స్ తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్స్‌ను తొలిసారిగా గతేడాది ఆగస్టు 17 హాలీషార్ట్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఇక ఆస్కార్స్‌లో అయితే జూన్ 8న ప్రీమియర్ వేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది.
ఈ లఘు చిత్రానికి ఇప్పటివరకు మూడు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. గతేడాది హాలీషార్ట్స్, మాంట్ క్లెయిర్, న్యూయార్క్ షార్ట్స్ చిత్రోత్సవాల్లో దీనికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఆస్కార్ కోసం బరిలో నిలిచింది. మరి ఈ 22 నిమిషాల షార్ట్ ఫిల్మ్ 2025లో ఆస్కార్ అందుకుంటుందేమో చూడాలి. ఒకవేళ వస్తే ఇక్కడి షార్ట్ ఫిల్మ్ మేకర్లకు బూస్టింగ్ వచ్చినట్లు ఉంటుంది కూడా.