యూట్యూబ్ స్టార్స్ గా పేరొందిన దివ్యశ్రీ, అభినవ్, నిఖిల్ గాజుల కీలకపాత్రల్లో నటించిన వెబ్ ఫిలిం “వైఫ్ ఆఫ్”. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి భాను ఏరుబండి దర్శకుడు. సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది. మరి సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
Wife Off Review
కథ: చిన్నప్పటినుండి ఇష్టపడిన బావ (నిఖిల్ గాజుల)ను పెళ్లి చేసుకుని గంపెడు ఆశలతో కొత్తింట అడుగుపెడుతుంది అవని (దివ్యశ్రీ). ఆమె ఊహించుకున్న జీవితానికి భిన్నంగా తొలిరోజే కాళరాత్రిగా మారుతుంది. దాంతో.. అవనిని సమస్యల నుండి బయటపడేయడానికి అభి (అభినవ్ మణికంఠ) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనల సమాహారమే “వైఫ్ ఆఫ్” చిత్రం.
నటీనటుల పనితీరు: ముగ్గురిలో ఎక్కువగా ఆకట్టుకున్న నటుడు నిఖిల్ గాజుల. ఈ కథలో ప్రతి ఒక్కరికీ రెండు విభిన్నమైన కోణాలు ఉన్నప్పటికీ.. నిఖిల్ నటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో నిఖిల్ నటన హైలైట్ గా నిలుస్తుంది. దివ్యశ్రీ తన వయసుకు మించిన పాత్రలో అవనిగా ఆకట్టుకుంది. చిన్నపాటి రిస్క్ చేసిందనే చెప్పాలి. మరో కీలకపాత్రలో అభినవ్ మణికంఠ అలరించాడు. ముఖ్యంగా.. ఫ్రిడ్జ్ ముందు కూర్చునే సీన్ లో నటన, ఆ సీన్ ని కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది. మరో పాత్రలో సాయిశ్వేత స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు భాను ఏరుబండి ఎంచుకున్న కథలో వైవిధ్యం ఉంది. మల్టీ లేయర్ స్టోరీగా కథనాన్ని నడిపించిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా 12 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. అయితే.. పరిమిత బడ్జెట్ మరియు తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాల్సి రావడంతో ఫైనల్ ప్రొడక్ట్ కాస్త ఎఫెక్ట్ అయ్యిందనే చెప్పాలి. ఓవరాల్ గా.. రచయితగా, దర్శకుడిగా భాను మంచి మార్కులు సంపాదించుకున్నాడు.
అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్ సీక్వెన్స్ ను డీల్ చేసిన విధానం బాగుంది. నేపథ్య సంగీతం విషయంలోనే ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ ప్రాజెక్ట్ కు తగ్గట్లుగా ఉంది. సాయికృష్ణ గణాల ఎడిటింగ్ & ట్రాన్సిషన్స్ సినిమాకి మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేసాయి.
విశ్లేషణ: లిమిటెడ్ బడ్జెట్ లో “వైఫ్ ఆఫ్” లాంటి ప్రొడక్ట్ ను కంప్లీట్ చేయడమే పెద్ద సాహసం. ఆ సాహసాన్ని ఈటీవీ విన్ దాకా తీసుకురావడం అనేది భాను & టీమ్ అసలైన గెలుపు. ఈ ప్రయత్నాన్ని ఆహావిస్తే మరింత మంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ ముందుకు వస్తారు. వీకెండ్ కి “వైఫ్ ఆఫ్” మంచి టైమ్ పాస్ సినిమా.
ఫోకస్ పాయింట్: మెచ్చుకోదగ్గ ప్రయత్నం!
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus