మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ద్వారా తెరమీదికొచ్చింది అనుపమ పరమేశ్వరన్. మేరీ జార్జ్ పాత్రకు వన్నెలద్దిన ఈ చిన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రేమమ్ సినిమా చూసి అనుపమపై మనసు పారేసుకున్న వారిలో సగానికి సగంమంది ‘నాగవల్లి’గా ఆమెను చూశాక సైడైపోయారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. పరభాషలో తొలి సినిమా అయినప్పటికీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న అనుపమ అదంతా త్రివిక్రమ్ చలవే అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ‘ప్రేమమ్’ ప్రచారంలో పాల్గొన్న ఈ మలయాళీ అందం త్రివిక్రమ్ గురించి చెబుతూ “ఆయన నా గురువు లాంటివారని, నాకెలాంటి పాత్రలు నప్పుతాయో నాకంటే ఆయనకే బాగా తెలుసంటూ” గురుభక్తిని చాటుకుంది.
ఇక తెలుగు ‘ప్రేమమ్’ గురించి చెబుతూ ఒకసారి చేసిన పాత్ర మరోసారి చేయడం బోర్ అన్న అనుపమ ‘ప్రేమమ్’ విషయంలో ఇది వర్తించదని చెప్పింది. ఈ సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా మేరీ పాత్ర నేనే చేస్తానని ఆ పాత్రపై తన ప్రేమను బయటపెట్టింది. నేటివిటీకి అనుగుణంగా అక్కడ క్రిష్టియన్ అయిన మేరీ పాత్రలో మెప్పించిన అనుపమ, ఇక్కడ సుమ అనే హిందూ అమ్మాయిగా కనపడనుంది. ఈ సినిమా సంభాషణలు కూడా తన గొంతులోనే వింటారని చెబుతోన్న అనుపమ ప్రస్తుతం తెలుగులో వేగేశ్న సతీష్-శర్వానంద్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తోన్న ‘శతమానం భవతి’ సినిమాలో నటిస్తోంది.