నాయికగా కొత్త తరహా పాత్రలు చేయాలనే తపన తనలో ఉందంటోంది మలయాళ సుందరి అనుపమా పరమేశ్వరన్. అయితే అలాంటి వినూత్నమైన కథలు తన దగ్గరకు రావడం లేదని బాధపడుతోంది. తనకొచ్చిన కథల్లో మంచివి ఎంచుకుని చేస్తున్నానని చెబుతోంది. ఇటీవలే రామ్‌తో కలిసి హలో గురు ప్రేమ కోసమే చిత్రంతో తెరపైకి వచ్చిన ఈ అందాల తార ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు. ఫలితంగా ఆమెకు తదుపరి రానున్న అవకాశాలపై స్తబ్దత నెలకొంది. ఈ సందర్భంలో అనుపమా మాట్లాడుతూ… “నాకూ భిన్నమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ పొరుగింటి అమ్మాయి అనే ముద్ర నాపై పడిపోయింది.
పది కథలు నా దగ్గరకు వస్తే వాటిలో రెండు మంచివి ఎంపిక చేసుకుంటాను. ఆ రెండు కూడా ఇలాంటివే వస్తున్నాయి. ప్రస్తుతం కన్నడలో నటసార్వభౌమ అనే చిత్రంలో నటిస్తున్నాను. పునీత్ రాజ్ కుమార్ హీరో. నాకిది కన్నడలో తొలి సినిమా. తెలుగు, తమిళం నేర్చుకున్నాను. కానీ కన్నడ కష్టమవుతోంది. అందులోనూ నాది లాయర్ పాత్ర. ఆ పాత్ర కోసం వేరే వాళ్లు డబ్బింగ్ చెబుతున్నారు అని తెలిపింది. ఇక తన దగ్గర ఎవరు అనవసర స్వేచ్ఛ తీసుకున్నా చిరాకేస్తుందని చెబుతుందీ భామ. మనుషుల ఆలోచన విధానం మారాలంటోంది. అనుపమా స్పందిస్తూ…టీజింగ్ ఏ అమ్మాయికీ నచ్చదు. మనుషులు మారితేనే పరిస్థితి మారు తుంది. నాకైతే ఎవరైనా ఏమైనా అంటే చిరాకు వస్తుంది. మీటూ గురించి చాలా మంది బయటకొచ్చి మాట్లాడు తున్నారు. అది మంచిదే. నాకు ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురుకాలేదు. అని చెప్పింది.