‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమాలో టిల్లు తన వన్‌లైనర్‌లు, కామెడీతో అలరించినా గ్లామర్‌ను టన్నులు టన్నులు ఒలకబోసింది మాత్రం లిల్లీ అలియాస్ అనుపమ పరమేశ్వరనే (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’ (DJ Tillu) అంటే రాధిక ఎలా గుర్తొస్తుందా? లిల్లీ కూడా అంతే. కెరీర్ లూప్‌లో చిక్కుకుందేమో అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గేర్ మార్చి తనెంత డిఫరెంటో చెప్పింది అనుపమ. అయితే ఇప్పుడు మరో వైవిధ్యమైన కథను ఎంచుకుంది. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ చర్చ.
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన మహమ్మారి కరోనా. ఆ చీకటి రోజుల్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నా ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి సమయంలో చిక్కుకున్న ఓ అమ్మాయి.. పరిస్థితుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే ‘లాక్‌డౌన్’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లోఒ రూపొందిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో సినిమా మెయిన్ కాన్సెప్ట్‌ను చూపించారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న, అందులోనూ ‘టిల్లు స్క్వేర్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ సమయంలో మరికొన్ని మాస్ సినిమాలు ఎంచుకుని కుర్రాళ్లకు కునుకు లేకుండా చేయాల్సిన సమయంలో అనుపమ ఇలాంటి కథ ఎందుకు ఎంచుకుంది అనే ప్రశ్న మొదలైంది. ఏఆర్ జీవా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌లో గందరగోళం, కుట్రలు, భావోద్వేగాలు చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కూడా అలానే ఉంటుంది అని చెప్పడం టీమ్ ఉద్దేశం.
సినిమా కాన్సెప్ట్ బాగానే కనిపిస్తున్నా.. రెండేళ్ల క్రితం ముగిసిన ఆ కష్టమైన పరిస్థితిని ఇప్పుడు మళ్లీ తెరపై జనాలు చూస్తారా? అనేదే ఇక్కడ ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఒకటి, రెండు సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. మరిప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఎంతవరకు అలరిస్తుంది అనేది చూడాలి. ఇక అనుపమ సినిమాలు చూస్తే.. ‘జేఎస్‌కే ట్రూత్ షాల్ ఆల్వేజ్ ప్రివైల్’ (మలయాళం), ‘పరదా’ (తెలుగు), ‘పెట్ డిటెక్టివ్’ (మలయాళం), ‘బైసన్’ (తమిళం) అనే సినిమాలు చేస్తోంది.