ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ సమస్యలపై సీఎంఎ జగన్ మోహన్ రెడ్డితో సినిమా పెద్దలు మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా అంశాలు చర్చకొచ్చాయి. అయితే అందులో అందరి దృష్టిని ఆకర్షించే అంశం… ‘విశాఖపట్నంలో జూబ్లీహిల్స్’. అసలు వైజాగ్‌లో జూబ్లీహిల్స్ అంటే ఏంటి? జగన్ ఏం చెప్పాలనుకున్నారు? సినిమా పెద్దలకు ఏం అర్థమైంది? జగన్ అడిగిన పని సినిమావాళ్లు చేయగలరా? జగన్ కోరినట్లు సినిమా పరిశ్రమ ఏపీకి తరలివెళ్తుందా? ఇప్పుడు ఇదే చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది.
ఏపీ సీఎం జగన్ అడిగిన విషయాలు చూస్తే… సినీ పరిశ్రమ విశాఖపట్నానికి తరలి రావాలి. అక్కడ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. అలాగే స్టూడియోల నిర్మాణానికి ఆసక్తి చూపిస్తే స్థలాలు కూడా అందిస్తాం. అక్కడ జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని సృష్టిద్దాం అని అన్నారు. తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఏపీలోనే జనాభా, ప్రేక్షకులు, థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. మనం అందరం అక్కడికి వెళ్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో మహానగరాలతో పోటీపడుతుంది అని సీఎం జగన్ సూచించారు.
అయితే సమావేశంలో సినీ పెద్దలు కొందరు జగన్ మాటలకు తలూపారు. బయటకు వచ్చి కూడా ఆ విషయాలన్నీ చెప్పారు. అయితే సీఎం జగన్ అడిగినట్లు మొత్తం పరిశ్రమ విశాఖపట్నానికి తరలించడం సాధ్యమా? అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ పాతుకుపోయింది. మద్రాసు నుండి ఇక్కడకు వచ్చాక… చాలా కాలం ఇబ్బందులు పడ్డా… ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు ఇక్కడ కాదు అందరూ వైజాగ్ వచ్చేయండి అంటే ముందుకు వెళ్లడం కష్టమే.
విశాఖపట్నంలో సినిమా చిత్రీకరణలకు అనువైన పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఏదో సాదాసీదా సన్నివేశాలకు వీలవుతుంది తప్ప… సెట్‌లు వేసి సినిమాలు తీసే పరిస్థితి లేదు. ఉన్న ఒక్కగానొక్క స్టూడియో పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. కొత్త స్టూడియోలు కట్టాలంటే ఇప్పుడు మొదలుపెడితే ఎప్పటికో అవుతాయి. ఈలోపు అక్కడ షూటింగ్‌లు కష్టమే. కాబట్టి ఇదేదో నిమిషాల్లో, మాటల్లో అయ్యేది కాదు. ఇక సీఎం చెప్పినట్లు తెలంగాణ కంటే ఏపీలోనే పరిశ్రమకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అలా అని సినిమా ఇండస్ట్రీ తెలంగాణను వదిలేసుకునే పరిస్థితి అయితే ఉండదు.
ముఖ్యంగా హైదరాబాద్‌ను వదిలేసే పరిస్థితి లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి ముందుకు నడవాలని సినిమా పెద్దలు భావించొచ్చు. అలాంటప్పుడు ఇక్కడి నుండి వెళ్లిపోతే ఎలా అని తెలంగాణ సీఎం అడిగితే సమాధానం ఉండదు. అందుకే ఇక్కడా – అక్కడా అనే కాన్సెప్ట్‌లోనే షూటింగ్‌లు పెట్టాలి. కాబట్టి వైఎస్ జగన్ అడిగింది అడిగినట్లు చేయలేరు. అయితే ఏపీ ప్రభుత్వం అక్కడ స్థలాలు ఇస్తే స్టూడియోలు నిర్మించుకొని షూటింగ్‌లు చేయొచ్చు. అక్కడ ఆఫీసులు పెట్టొచ్చు. మరి సీఎంను కలసిన సినిమా పెద్దలు, మంత్రి పేర్ని నాని హైదరాబాద్ వచ్చి కలసి సినిమా పెద్దలు ఏం చేస్తారో చూడాలి.