టాలీవుడ్ సినీ ప్రముఖులు కోరుకున్న విధంగా ఏపీ ప్రభుత్వం కొత్త టికెట్ రేట్ల జీవోను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవో అమలులో ఉన్న షరతులు మాత్రం వింతగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలలో మెజారిటీ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలు మినహా మిగిలిన సినిమాలన్నీ 200 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం.
200 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ సినిమాలలో హీరో రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషన్, హీరోయిన్ రెమ్యునరేషన్ తీసివేస్తే ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాల బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటదు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏపీలో 20 శాతం షూటింగ్ ను జరుపుకుంటే మాత్రమే 100 కోట్ల రూపాయల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే సినిమా కథకు తగిన లొకేషన్లు ఏపీలో లేకపోతే పరిస్థితి ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం నిబంధనల వల్ల ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు అదనపు టికెట్ రేట్లు ఉండవు. హీరోల రెమ్యునరేషన్లు తీసేస్తే ఈ సినిమాల బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటే ఛాన్స్ అయితే లేదు. కొత్త టికెట్ల జీవో కోసం సీఎం జగన్ ను కలిసిన హీరోలలో చిరంజీవి, మహేష్ ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు దాదాపుగా పూర్తి కావడంతో ఈ సినిమాలను ఏపీలో షూట్ చేసే పరిస్థితులు కూడా లేవు.
అదనపు టికెట్ రేట్ల వల్ల రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ బాగానే ప్రయోజనం పొందనుండగా ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు మాత్రం బెనిఫిట్ ఉండదు. టాలీవుడ్ స్టార్ హీరోలు తమ తర్వాత సినిమాలను మాత్రం రెమ్యునరేషన్లు కాకుండా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కేలా జాగ్రత్త పడటంతో పాటు ఏపీలో కొన్ని సీన్లు షూట్ చేసే ఛాన్స్ ఉంది. అదనపు టికెట్ రేట్ల వల్ల 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల వరకు బెనిఫిట్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు సైతం ఈ ఆఫర్ ను వదులుకునే ఛాన్స్ అయితే లేదు.