ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది. ఒకటే రాజధాని అంటూ తెలుగుదేశం, మూడు రాజధానులు అంటూ వెఎస్‌ఆర్‌సీపీ అంటోంది. దీని మీద రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోర్టుల్లో కేసు ఉంది. అయితే ఈ క్రమంలో రాయలసీమ గర్జన అంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ఆ వేదిక మీద నుండి మంత్రులు, నాయకులు మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి టాలీవుడ్ హీరోలు అంతా సాయం చేయాలంటూ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ‘‘ఒక రాయలసీమ బిడ్డగా తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలందరినీ అడుగుతున్నా… మీరు ఏ సినిమా చేసినా కర్నూలు.. కర్నూలు అంటుంటారు కదా. ఈ ప్రాంతం పేరుతో సినిమాలు చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు కదా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అందరూ ఏకమై కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి డిమాండ్ చేయాలని అడుక్కుంటున్నా’’ అని కోరారు మంత్రి.
‘‘చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికే పవన్ కళ్యాణ్‌ను కూడా ఇదే మాట అడుగుతున్నా. చంద్రబాబును బాయ్‌కాట్ చేసి కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వండని హెచ్చరిస్తున్నా’’ అని అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. అయితే ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు మాత్రం వేరేలా అంటున్నారు. మంత్రి ఉద్దేశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించే అలా మాట్లాడారు అని అంటున్నారు. టాలీవుడ్‌లో రాయలసీమ పేరుతో అత్యధికంగా సినిమాలు చేసింది బాలకృష్ణే అని గుర్తు చేసుకున్నారు.
అందుకే మంత్రి అలా మాట్లాడారు అని వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులు అంటున్నారు. అయితే ఈ విషయంలోకి సినిమా వాళ్లను లాగడం సరికాదు అని మరికొంతమంది తటస్థుల మాట. రాజకీయంలోకి సినిమాను తీసుకొచ్చి ఇబ్బందిపెట్టడం ఎందుకు అంటున్నారు. అయితే సినిమాలు, రాజకీయాలు అనే వేరుమాట ఎప్పుడో పోయిందని, ప్రతి హీరో ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే ఉన్నారనేది మరికొందరి మాట. ఏది ఏమైనా మంత్రి మాటలకు ఎవరైనా హీరో స్పందిస్తారేమో చూడాలి.