ప్రఖ్యాత స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఆస్కార్ విజేత అయిన ఎ.ఆర్.రెహమాన్ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అతని తల్లి కరీమా బేగమ్ నేడు మరణించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తోన్న కరీమా బేగం చెన్నయ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్టు సమాచారం. తన తల్లి మరణించిన విషయాన్ని రెహమాన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. రెహమాన్ తండ్రి శేఖర్ కూడా సంగీత కళాకారుడన్న సంగతి అందరికీ తెలిసిందే.
నిజానికి రెహమాన్ అసలు పేరు దిలీప్. శేఖర్ కన్నుమూసిన తరువాత దిలీప్ అలియాస్ రెహమాన్ మ్యూజిక్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. దిలీప్ గా ఉన్న రెహమాన్ సూఫీయిజాన్ని స్వీకరించడానికి అతని తల్లి కరీమా ప్రోత్సాహం చాలా ఉందట. శేఖర్ అనారోగ్యంతో మరణించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన కరీమా.. సూఫీయిజం ద్వారా స్వాంతన పొందిందట. అందుకే ఆమె పేరును కరీమా బేగమ్ గాను అలాగే కొడుకు దిలీప్ పేరును అల్లా రఖా రెహమాన్ గాను మార్చిందట.
అటు తరువాత కొన్నాళ్ళకు వీరి ఫ్యామిలీ మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించారట.ఇక తల్లి కరీమా అంటే రెహమాన్ కు ప్రాణం. ఇతను గొప్ప సంగీత దర్శకుడు కావాలని కలలు కనడంతో పాటు ఆ దిశగా రెహమాన్ ను నడిపించింది కూడా కరీమానే అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. కొందరు సినీ ప్రముఖులు రెహమాన్ ను ఓదార్చడానికి ముందుకు వస్తున్నట్టు సమాచారం.