ఇండియన్ సినిమా నటులు అంతా వేరు.. అరవింద్ స్వామి వేరు. ఈ మాట మేం అనడం లేదు. ఆయన స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగినప్పుడు సినిమా జనాలు ఈ మాటే అనుకున్నారు. అంతలా తన స్క్రీన్ ప్రజెన్స్, అందంతో ఆకట్టుకున్నారు అరవింద్ స్వామి. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా సినిమాలకు దూరమైపోయారు. ఆ రోజుల్లో అరవింద్ స్వామిని సినిమాల జనాలు బాగా మిస్ అయ్యారు. మంచి పాత్రలు కూడా మిస్ అయ్యాయి. తాజాగా ఈ విషయమై అరవింద్ స్వామి స్పందించారు.
‘రోజా’,‘బొంబాయ్’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం అయ్యారు అరవింద్ స్వామి. 1999 వరకు తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన.. ఆ తర్వాత 13 ఏళ్ల వరకు ముఖానికి రంగేసుకోలేదు. మణిరత్నం తెరకెక్కించిన ‘కడల్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అక్కడికి రెండేళ్లకు ‘తనిఒరువన్’ చేశారు. అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన పాత్రకు వెయిట్ ఉంటేనే. ఆ గ్యాప్‌నకు కారణం ఆరోగ్య సమస్యలే అని ఆయన చెప్పారు.
వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్లు బెడ్ రెస్ట్ తీసుకున్నారు అరవింద్ స్వామి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన కాలికి పాక్షికంగా పక్షవాతం కూడా వచ్చిందట. ఈ అరోగ్య సమస్యల వల్లనే 13 ఏళ్లపాటు ఒక్క సినిమాలో కూడా నటించలేదని తెలిపారు. ‘కడల్’ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెండు హాఫ్ మారథాన్లలో కూడా పాల్గొన్నా అని అరవింద్ స్వామి తెలిపారు.
సెకండ్ ఇన్నింగ్స్ అరవింద్ స్వామి ఫుల్ బిజీలో ఉన్నారు. రీసెంట్‌గా కార్తితో కలసి ‘సత్యం సుందరం’లో నటించారు. గత నెల 28న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. అంతకుముందు ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు.