‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో `ప్రాజెక్ట్ కె` ఒకటి. ‘మహానటి’ వంటి క్లాసిక్ ను బ్లాక్ బస్టర్ ను అందించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ పై రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అశ్వినీదత్. దీపికా పదుకొనె ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించింది చిత్ర బృందం.
ఈ చిత్రం గురించి నిర్మాత అశ్వినీదత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ‘సీతా రామం’ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆయన పనిలో పనిగా ‘ప్రాజెక్టు కె’ గురించి కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘ప్రాజెక్ట్ కె’ ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ప్రభాస్, దీపికా పదుకొనే సెట్స్ లోకి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ తో షూటింగ్ పూర్తవుతుంది.ఎనిమిది నుండి తొమ్మిది నెలల పాటు గ్రాఫిక్స్ వర్క్ కు కేటాయించాం.
హాలీవుడ్ అవెంజర్స్ స్థాయిలో ‘ప్రాజెక్ట్ కె’ ఉంటుంది. ఈ చిత్రంతో చైనా, అమెరికా మార్కెట్ లని కూడా టార్గెట్ చేస్తాం. 2023 అక్టోబర్ లో కానీ 2021 జనవరిలో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు అశ్వనీ దత్. ప్లానింగ్ బాగానే ఉంది కానీ ఆ టైంకి సినిమా నిజంగానే రెడీ అవుతుందా అనే సందేహాలు అభిమానులకు కూడా ఉన్నాయి.
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వమంటే ఎస్కేప్ అయిపోతున్నాడు. మొత్తానికి అశ్వినీదత్ మాత్రం మంచి అప్డేట్లే ఇచ్చారు అని చెప్పాలి.