క్రిస్మస్ రేసు రసవత్తరంగా మారుతుందని అంతా భావించారు. డిసెంబర్ 25న ఒకేసారి ఆరు తెలుగు సినిమాలు రిలీజ్‌కు కర్చీఫ్ వేశాయి. అడివి శేష్ డెకాయిట్, రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల, విశ్వక్ సేన్ ఫంకీ, కొత్త ప్రయత్నాలు పతంగ్, యుఫోరియా.. ఇలా అన్నీ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఈ లెక్కలన్నీ ఇప్పుడు తలకిందులయ్యేలా ఉన్నాయి.
ఈ చిన్న సైజు యుద్ధానికి వారం ముందే, డిసెంబర్ 19న, అసలైన బాక్సాఫీస్ సునామీ రాబోతోంది. జేమ్స్ కామెరాన్ సృష్టి ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ ఇండియాలో, ముఖ్యంగా తెలుగులో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇది కేవలం ఒక డబ్బింగ్ సినిమా కాదు. అవతార్ 2 సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఈ సినిమా కోసం ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఈ అవతార్ తుఫానుకు ఇప్పుడు జక్కన్న బలం తోడైంది. ఈ సినిమా ఇండియన్ ప్రమోషన్స్‌లో రాజమౌళి పాలుపంచుకోవడమే కాకుండా, అసలైన బాంబ్ పేల్చనున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న SSMB29 ఫస్ట్ టీజర్‌ను అవతార్ 3 ప్రింట్లతో పాటే థియేటర్లలో రిలీజ్ చేయనున్నారట. ఇది నిజమైతే, తెలుగు ప్రేక్షకులు అవతార్ చూడటానికి మరో పెద్ద కారణం దొరికినట్లే.
SSMB29 టీజర్ కోసం కూడా ప్రేక్షకులు అవతార్ 3కి క్యూ కడతారు. అంటే, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, కనీసం రెండు వారాల పాటు మల్టీప్లెక్స్‌లు, ప్రీమియం స్క్రీన్లు అన్నీ అవతార్ షోలతోనే నిండిపోతాయి. ఈ రాకాసి తుఫాను తర్వాత, సరిగ్గా ఆరు రోజులకు (డిసెంబర్ 25న) రిలీజ్ అవుతున్న మన సినిమాల పరిస్థితి ఏంటి?
డెకాయిట్, ఛాంపియన్, శంబాల, ఫంకీ, పతంగ్, యుఫోరియా.. ఈ ఆరు చిత్రాల నిర్మాతలకు ఇప్పుడు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అవతార్ + రాజమౌళి అనే ఈ డెడ్లీ కాంబినేషన్ ముందు, కంటెంట్ ఎంత బాగున్నా కనీసం థియేటర్లు దొరకడమే కష్టంగా మారుతుంది. ఈ సునామీని తట్టుకొని నిలబడే సాహసం చేస్తారో, లేక వెనక్కి తగ్గుతారో చూడాలి.