2009లో విడుదలైన “అవతార్” సినిమా సంచలనం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా సృష్టించిన వసూళ్ల హోరు, ప్రేక్షకులపై చూపిన ప్రభావం సినిమాకు ఓ ఐకాన్ స్టేటస్ తెచ్చింది. ఈ విజయం తర్వాత, దర్శకుడు జేమ్స్ కామెరూన్ మూడు సీక్వెల్స్‌ను ప్రకటించి, అవి కూడా అంతే స్థాయిలో విజయవంతం అవుతాయన్న నమ్మకాన్ని చూపించారు. 2022లో విడుదలైన “అవతార్-2: ది వే ఆఫ్ వాటర్”కు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా మిశ్రమ స్పందన పొందింది.
విజువల్స్ కొంతమందికి బోరింగ్‌గా అనిపించగా, పునరావృత సన్నివేశాల వల్ల ప్రేక్షకులలో కొంత నిరాశ నెలకొంది. అయినప్పటికీ, ఫస్ట్ పార్ట్ క్రేజ్ వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కానీ, ఈ ఫీడ్‌బ్యాక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దృష్టికి వెళ్లినట్టుంది. “అవతార్-3” (Avatar 3) గురించి కామెరూన్ ఇటీవల చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ‘‘ఇది గత రెండు పార్ట్‌ల కంటే మెరుగ్గా ఉంటుందట. అవతార్ సిరీస్‌లో పునరావృతం కాని సన్నివేశాలు, కొత్త పాత్రలు, విభిన్న కథాంశంతో ముందుకు వస్తున్నాం.
ఫైర్ థీమ్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో పాత్రలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. మూడో భాగం కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది, భిన్నమైన కథనాన్ని అనుభూతి పరుస్తుంది,’’ అని కామెరూన్ తెలిపారు. “అవతార్-3” (Avatar 3) డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వినూత్నమైన యాక్షన్ సన్నివేశాలు, అందమైన విజువల్స్ ప్రేక్షకుల అంచనాలను మించబోతున్నాయని కామెరూన్ హామీ ఇచ్చారు.
ఈ సినిమాతో అభిమానులు ఇంకా కొత్త అనుభూతిని పొందుతారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి, “అవతార్-3” పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జేమ్స్ కామెరూన్ హామీ ఇచ్చినట్లుగా, ఈ చిత్రం గత రెండు భాగాలను మించిన విజువల్ వండర్‌గా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.