తెలుగు చిత్రానికి అంత సీన్ లేదు.. భారతీయ చిత్ర పరిశ్రమకి బాస్ బాలీవుడ్.. హిందీ సినిమాల తర్వాతే ఏదైనా.. అనే అనేక మాటలకు బాహుబలి తన కత్తితో సమాధానం చెప్పాడు. తెలుగు వారు గర్వించేలా రోజుకొకటి చొప్పున రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా వందరోజుల మైలురాయిని దాటుకొని శెభాష్ బాహుబలి అనిపించుకున్నాడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో 13 వేల తెరలపై రిలీజ్ అయింది. జక్కన్న ఊహాశక్తికి ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరుల నటన తోడై ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచింది.
దీంతో ఎవరూ ఊహించలేనంతగా 1700 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి భారతీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. సినిమాలు థియేటర్లలో 50 రోజులు ప్రదర్శించబడడం గగనం అయిపోతున్న ఈ సమయంలో నిన్నటి (ఆగస్టు 4 ) తో వందరోజులు పూర్తి చేసుకొని బాహుబలి 2 సరికొత్త రికార్డును నెలకొల్పింది. రాజమౌళికి థియేటర్స్ సంఖ్య వెల్లడించడం ఇష్టం లేకపోవడంతో ఆ వివరాలని చిత్ర బృందం ప్రకటించలేదు. ఈ శుభసందర్భాన్ని చిత్ర యూనిట్ మాత్రమే కాదు తెలుగు ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.