రేపే ఏపీ ఎన్నికలకు ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటూ తెలంగాణా ప్రజలు కూడా ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రేపు ఓట్ల లెక్కింపు ఉండడంతో తన రెగ్యులర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడట సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. 2014 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు బాలయ్య. స్వతహాగా… బాలయ్యకు సెంటిమెంట్లు బాగా ఎక్కువ. అయితే… ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన ఓ సెంటిమెంట్ ని బాగా నమ్ముతాడట.
2014 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండీ శాసనసభ్యుడిగా పోటీ చేశాడు బాలయ్య. జిల్లా కేంద్రంలోని ఎస్కేయూలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో 2014లోనూ ఆర్డీటీ స్టేడియంలో బాలయ్య బస చేశాడు. అదికూడా స్టేడియంలోని 9వ నెంబర్ గదిలో…! ఇక ఇప్పుడు కూడా మరోసారి అదే హిందూపురం నుండీ రెండోసారి శాసనసభ్యుడిగా టీడీపీ తరపున బరిలోకి దిగాడు బాలయ్య. మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కేంద్రంలోని ఎస్కేయూలో నిర్వహిస్తున్నారు. బాలయ్య కౌంటింగ్‌కు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉన్న గదిలోనే ఉండాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నాడట.
అయితే… ఆ సమయానికే ఆర్డీటీ మరొకరికి ఆ గదిని కేటాయించింది. అయితే ఆ గదిని ఖాళీ చేయించి మరీ బాలయ్యకు ఇచ్చారంట. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్డీటీ స్టేడియంకు బాలయ్య చేరుకుంటాడట. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. మరి ఈసారి బాలయ్య సెంటిమెంట్ ఫలిస్తుందా లేదా… అన్నది మరొక్క రోజులో తేలిపోతుంది.