Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..
- March 26, 2026 / 10:58 AM ISTByFilmy Focus Desk
ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) – 2026 పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలో ఇటీవల ఘనంగా జరిగింది. ఇందులో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) అరుదైన పురస్కారం దక్కింది. ఈ వేడుకల్లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగానికి చేసిన విశేష కృషికిగాను ఈ అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మతోపాటు నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్ పాల్గొన్నారు.
Balakrishna
ఈ వేడుకల్లో బాలకృష్ణతో పాటు.. అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత ప్రముఖ నటుడు ధర్మేంద్రను కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చి గౌరవించారు. ధర్మేంద్ర తరఫున ఆయన కుటుంబ సభ్యులు పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారంతో బాలకృష్ణ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరినట్లు అయింది. గత రెండేళ్లుగా బాలయ్యకు (Balakrishna) వరుస పురస్కారాలు దక్కుతున్నాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు ఏడాది తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. 2024లోనే ఐఫా ఉత్సవం నుండి గోల్డెన్ లెగసీ పురస్కారం అందుకున్నారు.

ఇక బాలయ్య (Balakrishna) సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘అఖండ 2: తాండవం’ సినిమాతో అలరించారు. అయితే ఆ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాను స్టార్ట్ చేయనున్నారు. మామూలుగా అయితే ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసే బాలయ్య ఈసారి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను ఫైనల్ చేసే పనుల్లో బాలయ్య బిజీగా ఉన్నాడని సమాచారం. త్వరలోనే ఆ సినిమాను కూడా అనౌన్స్ చేస్తారు అని చెబుతున్నారు. అందులో బాలయ్య (Balakrishna) కూడా నటిస్తాడని, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారని చెబుతున్నారు. ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’గా ఈ సినిమా రూపొందనుందనే విషయం తెలిసిందే.
6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు












