‘అఖండ’ టీమ్‌తో ‘అన్‌స్టాబుల్’ ఇంటర్వ్యూ అనేసరికి… ఏముందిలే సినిమా గురించి మాట్లాడుకుంటారు, సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన విషయాలు చెబుతారు అని అందరూ అనుకుంటారు. అయితే ఆ ఎపిసోడ్ ప్రోమో ఆఖరున బాలయ్య నోటి వెంట ‘వెన్నుపోటు’ అనే మాట వినిపించింది. దాంతో అందరూ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. బాలయ్య, తెదేపా విషయాల్లో వెన్నుపోటుకు ఉన్న ప్రాధాన్యం అటువంటిది. దీంతో ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేశారు.
అనుకున్న రోజు రానే వచ్చింది. అన్‌స్టాపబుల్ ‘అఖండ’ ఎపిసోడ్ కూడా స్ట్రీమ్ అయ్యింది. బాలయ్య వెన్నుపోటు గురించి మాట్లాడారు కూడా. అయితే ప్రజలకు దాని ద్వారా ఏమన్నా తెలిసిందా అంటే ఏమీ లేదనే చెప్పాలి. దీంతో పెద్ద ఎన్టీఆర్ అభిమానులకు, తెదేపా కార్యకర్తలకు, బాలయ్య ఫ్యాన్స్‌కు కూసింత నిరాశ ఎదురైందనే చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిడు అయినప్పటి నుండి తెలుగు నాట ‘వెన్నుపోటు’ ప్రస్తావనే వస్తూనే ఉంది. తెదేపా ప్రస్తుత అధినేత చంద్రబాబు టార్గెట్‌గా ఈ మాట వినిపిస్తుంటుంది.
మధ్యలో మధ్యలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా ఈ తరహా మాటలు పడుతూ ఉంటారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ‘వెన్నుపోటు’ టాపిక్ మళ్లీ వచ్చింది. దీనిపై వివరణ ఇచ్చేలా బాలయ్య ‘అన్‌స్టాపబుల్’లో మాట్లాడారు అని ప్రోమో చూసి అనుకున్నారు. అయితే ఆశగా ఎపిసోడ్ చూసిన వారికి నిరాశే ఎదురైంది. ఎపిసోడ్‌లో బాలయ్య కొత్తగా చెప్పిందేమీ లేకపోవడం దీనికి కారణం.
‘‘మా మీద చాలామంది ‘వెన్నుపోటు’ కామెంట్లు చేస్తుంటారు. నిజానికి నాన్నగారు మా నుండి ఎలాంటి సాయం తీసుకోవడానికి ఇష్టపడరు. ఏదైనా ఇద్దామని చూస్తే నాకెందుకు మీరు ఇవ్వడం అనేవారు’’ అంటూ వేరే ఏదో పాయింట్ తీసుకొచ్చారు. ఒక విధంగా మా నుండి సాయం ఆయన తీసుకోరు కాబట్టి… పదవీచ్యుతుడు అయ్యే సమయంలో మేం ముందుకు రాలేదు అన్నట్లుగా ఉంది. దాంతోపాటు పార్టీని కాపాడుకోవడానికే మా బావ చంద్రబాబు నాయుడు అలా చేశారు అని ఆఖరున అన్నారు బాలయ్య. దీంతో ‘వెన్నుపోటు’ విషయంలో కొత్తగా ఏ విషయమూ బయటకు రాలేదు.