కొన్నేళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కృష్ణవంశీ ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్ అనుకున్నారు. రైతుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ బాలయ్యకు కూడా నచ్చింది. అయితే సినిమాలో కీలకపాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ అమితాబ్ నటించడానికి అంగీకరించలేదు. బిగ్ బీ ఒప్పుకుంటేనే సినిమా చేయాలని నిర్ణయించుకొని ఎదురుచూశాడు కృష్ణవంశీ. కొన్నాళ్లకు బాలయ్య కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
దీంతో కృష్ణవంశీ మరాఠీలో సక్సెస్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాని రీమేక్ చేయాలనుకున్నారు. దీనికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్ పెట్టి సినిమాను మొదలుపెట్టారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అనసూయ లాంటి తారలు నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. బాలయ్యతో చేయాలనుకున్న ‘రైతు’ సినిమాను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేయాలనుకుంటున్నారట కృష్ణవంశీ. గతంలో రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను రూపొందించాడు కృష్ణవంశీ.
అప్పటినుండి మెగా ఫ్యామిలీతో అతడికి మంచి బాండ్ ఏర్పడింది. అప్పట్లోనే చిరుతో సినిమా చేయాలనుకున్నాడు ఈ దర్శకుడు. కానీ ఆయన రాజకీయాల వైపు వెళ్లడంతో కుదరలేదు. ఇప్పుడు చిరు వరుస సినిమాలు చేస్తుండడంతో కృష్ణవంశీ కూడా ఆయన డేట్స్ కోసం చూస్తున్నాడు. బాలయ్య కోసం అనుకున్న ‘రైతు’ కథను చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా మార్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిరుని కలిసి కథ వినిపించబోతున్నారట. ఆయన గనుక ఓకే చెబితే వచ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.