Beast Review: బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 13, 2022 / 08:39 AM IST

తమిళ స్టార్ కథానాయకుడు విజయ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “బీస్ట్”. “కో కో కోకిల, డాక్టర్” చిత్రాలతో దర్శకుడిగా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు-తమిళ-హిందీ-మలయాళ భాషల్లో ఏకకాలంలో అనువాద రూపంలో విడుదలైంది. సాంగ్స్ & ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తి నెలకొల్పాయి. మరి సినిమా అదే స్థాయిలో ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: వీర రాఘవన్ (విజయ్) చేపట్టిన ఓ సీక్రెట్ ఆపరేషన్ లో జరిగిన చిన్నతప్పు వల్ల ఓ చిన్నారి చనిపోతుంది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిన వీర రాఘవన్, ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి తీసుకునే ట్రీట్మెంట్ లో భాగంగా ప్రీతి (పూజా హెగ్డే)ను కలుస్తాడు. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే లవ్ ప్రపోజ్ చేస్తుంది ప్రీతి.

అనుకోని విధంగా టెర్రరిస్టులు టార్గెట్ చేసిన ఓ మాల్ కి వస్తారు వీర రాఘవన్ & టీం. ఆ తర్వాత పరిస్థితులను అతడు ఎలా కంట్రోల్ చేశాడు? టెర్రరిస్టులను చేష్టలను ఎలా అరికట్టాడు? అనేడు “బీస్ట్” కథాంశం.

నటీనటుల పనితీరు: విజయ్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. వీర రాఘవన్ అనే ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయాడు విజయ్. చాన్నాళ్ల తర్వాత కామెడీ పరంగానూ ఆకట్టుకున్నాడు. అయితే.. విజయ్ లోని మాస్ యాంగిల్ ను స్టైలిష్ గా ప్రొజెక్ట్ చేయడంలో నెల్సన్ సక్సెస్ సాధించలేకపోయాడు. అందువల్ల విజయ్ అభిమానులు కోరుకునే స్థాయిలో ఎలివేషన్స్ సినిమాలో కనిపించవు.

పూజా హెగ్డే మూడు సీన్లు, రెండు పాటలకు పరిమితమైంది. అవి కూడా అసందర్భమైనవే. అందువల్ల ఆమె క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. అయితే.. గ్లామర్ పరంగా మాత్రం తమిళ ప్రేక్షకులను సంతుష్టపరచడానికి ప్రయత్నించి ఓ మేరకు సఫలీకృతురాలయ్యిందనే చెప్పాలి.

హీరోహీరోయిన్ల తర్వాత బాగా హైలైట్ అయ్యింది విటివి గణేష్. బేస్ వాయిస్ లో అతడి పంచ్ లకి ఆడియన్స్ పడీ పడీ నవ్వుతారు. యోగిబాబు కామెడీ మాత్రం ఈసారి ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడిగా అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు: కామెడీ సీన్స్ లో మినహా దర్శకుడు నెల్సన్ మార్క్ సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించకపోవడం “బీస్ట్”కి పెద్ద మైనస్. అలాగే అక్కరలేని యాక్షన్ సీన్స్ & అవసరమే లేని క్లైమాక్స్ ఎపిసోడ్ ను ఎందుకు ఇరికించారో అర్ధం కాలేదు. ఈ రెండూ లేకపోతే సినిమాని కనీసం కామెడీ కోసమైనా చూసేవారు. విజయ్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకునే ఈ ఎలివేషన్స్ ను ఇరికించినప్పటికీ.. సినిమాటిక్ గా వర్కవుటవ్వలేదు. సొ, ఓ కథకుడిగా, దర్శకుడిగా నెల్సన్ ఫెయిలయ్యాడనే చెప్పాలి.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి మెయిన్ హైలైట్స్. కంటెంట్ తో సంబంధం లేకుండా సినిమాకి తమ 100% శాతం ఇచ్చిన టెక్నీషియన్స్ వీరిద్దరు మాత్రమే. ముఖ్యంగా అనిరుధ్ సౌండ్ డిజైనింగ్ యాక్షన్స్ సీన్స్ కి మరింత థ్రిల్ యాడ్ చేసింది.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో నిర్మాణ సంస్థ ఎక్కడా రాజీపడలేదు.

విశ్లేషణ: విజయ్ నుంచి ఊహించే సినిమాలు వేరు, నెల్సన్ నుండి ఎక్స్ పెక్ట్ చేసే కంటెంట్ వేరు. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా అంటే సాధారణంగానే భిన్నమైన అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడంలో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా సినిమాలో పోలిటికల్ ప్రోపగాండా ఎక్కువవ్వడం, హీరో ఎలివేషన్స్ కోసం కథను తుంగలో తొక్కడం, క్యారెక్టరైజేషన్స్ కి సరైన ఆర్క్ లేకపోవడం వంటివన్నీ సినిమాకి మైనస్ గా మారాయి. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు. సో, దళపతి విజయ్ కి వీరాభిమాని అయితే తప్ప ఈ “బీస్ట్”ను థియేటర్లో ఎంజాయ్ చేయడం కష్టమే!

రేటింగ్: 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus