ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే.. సినిమా ఎలా ఉండబోతోంది, ఆ సినిమాలో హీరో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయాలు పట్టించుకోవడం మానేసి.. ఆ సినిమా మొదటిరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది. మొదటివారం ఎంత వసూలు చేస్తుంది, నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేవి మాత్రమే పట్టించుకొంటున్నారు అభిమానులు. అందుకే హీరోలు, దర్శకనిర్మాతలు తమ సినిమాలు మాగ్జిమమ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకొని మొదటివారంలోనే వీలైనంత వసూలు చేయాలని చూస్తున్నారు. అందుకు మహేష్ బాబు కూడా మినహాయింపు కాదు. అందుకే “భరత్ అనే నేను” చిత్రాన్ని ఓవర్సీస్ లో ఏకంగా 2000 షోలు వేయిస్తున్నాడు. అలాగే పారిస్ లో మొదటి షో చూసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు.
ఇక ఇండియాలోనూ నాన్ బాహుబలి రికార్డ్ ను సాధించడం కోసం, ముఖ్యంగా రామ్ చరణ్ తన ముందు ఉంచిన “రంగస్థలం” రికార్డులను బ్రేక్ చేయడం కోసం మహేష్ రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. మహేష్ సినిమా కాబట్టి మల్టీప్లెక్స్ ఆడియన్స్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ఇకపోతే మాస్ ఆడియన్స్ ను థియేటర్లకి రప్పించడమే పెద్ద సమస్య. పోలిటికల్ డ్రామా కావడంతో మాస్ ఆడియన్స్ ఎంతవరకూ ఆదరిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే.. ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమా బాగుంది అనే టాక్ వస్తే సరిపోదు. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సిందే. అప్పుడు కానీ.. సినిమా హిట్ అని నమ్మడం లేదు జనాలు. మరి మహేష్ బాబు “భరత్” రూపంలో రికార్డుల భరతం పడతాడో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది.