పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఫుల్ రన్ లో ఏపీ డిస్ట్రిబ్యూటర్లకు కొంతమేర నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా నిబంధనలను అమలు చేయడంతో ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. అయితే మేకర్స్ మొదట భీమ్లా నాయక్ కు రెండు రిలీజ్ డేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25వ తేదీన సినిమా విడుదల సాధ్యం కాకపోతే ఏప్రిల్ 1వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
అయితే భీమ్లా నాయక్ మేకర్స్ ఏప్రిల్ 1వ తేదీకి సినిమాను వాయిదా వేయకపోవడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఏప్రిల్ 1కు భీమ్లా నాయక్ వాయిదా పడి ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల విషయంలో నష్టపోయే అవకాశంతో పాటు కొత్త టికెట్ల జీవో అమలులోకి వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ భావించారు. అందువల్లే భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేయడానికి పవన్ ఆసక్తి చూపారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన సత్యనారాయణ భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి పవన్ ఇచ్చిన హామీతో పాటు ఆయన చేసిన కామెంట్లకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భీమ్లా నాయక్ రిలీజైతే తప్ప ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వదని పవన్ కు తెలుసని తన సినిమా వల్ల ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుందని పవన్ కళ్యాణ్ భావించారని చెప్పుకొచ్చారు. ఆ రీజన్ వల్లే టికెట్ రేట్లతో సంబంధం లేకుండా సినిమాను విడుదల చేయాలని పవన్ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారని సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేసి నష్టం వస్తే ఆ నష్టాన్ని సొంతంగా భరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని సత్యనారాయణ కామెంట్లు చేశారు. ప్రభుత్వం వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో జీవో నంబర్ 35ను అమలులోకి తీసుకొని రావడంతో పాటు ఇప్పుడు జీవోను వెనక్కు తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసని సత్యనారాయణ కామెంట్లు చేయడం గమనార్హం.