టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు.’మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై మహేష్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైంది. డిసెంబర్ వరకూ ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని టాక్ నడుస్తుంది. అయితే ‘సర్కారు వారి పాట’ చిత్రం తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై మాత్రం పెద్ద కన్ఫ్యూజనే ఏర్పడిందని చెప్పాలి.
‘ ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తర్వాత నా తదుపరి చిత్రం మహేష్ బాబు తోనే’ అంటూ.. ఇటీవల దర్శకుడు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యి అది సెట్స్ పైకి వెళ్లే సరికి మరో రెండు సంవత్సరాలు పడుతుంది అనడంలో సందేహం లేదు. అయినా కరోనా వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కూడా ఆగిపోయింది. కాబట్టి.. 2022 వరకూ ఆ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదనే చెప్పొచ్చు. దాంతో 2022 ఎండింగ్ లేదా 2023 వరకూ రాజమౌళి- మహేష్ బాబు ల స్క్రిప్ట్ ఫైనల్ అవుతుంది అని చెప్పలేము.
కాబట్టి ఈ గ్యాప్ లో మహేష్.. ‘సర్కారు వారి పాట’ కాకుండా మరో చిత్రం.. కుదిరితే రెండు చిత్రాలు చేసే అవకాశం ఉంది. అయితే అవి ఏ డైరెక్టర్లతో చేస్తాడు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా, వెంకీ కుడుముల వంటి డైరెక్టర్లు చెప్పిన స్క్రిప్ట్ లు విన్నాడు మహేష్. మధ్యలో అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ ల పేర్లు కూడా వినిపించాయి. మరి మహేష్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడనేది మాత్రం ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదనే చెప్పాలి.