ప్రముఖ సినీనటుడు సోనూసూద్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై నగరంలోని తన నివాస గృహాన్ని హోటల్ గా మార్చినందుకు సోనూసూద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతులు తీసుకోకుండా తన నివాస భవనాన్ని సోనూసూద్ హోటల్ గా మార్చారని బీఎంసీ ఆరోపించింది. ఈ విషయంలో బీఎంసీ అధికారులు సోనూసూద్ కి నోటీసులు పంపినప్పటికీ నటుడు స్పందించలేదని.. అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
కరోనా కష్టకాలంలో ఎందరినో ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. జుహూలోని శక్తిసాగర్ అనే భవనంలో నివాసం ఉంటున్నారు. ఆరు అంతస్థుల నివాస భవనాన్ని హోటల్ గా మార్చారని.. దీనికి సరైన అనుమతి లేదనేది బీఎంసీ ఆరోపణ. దీంతో పాటు ఆ భవనంలో పలు అక్రమ నిర్మాణాలు చేశారని.. రెండుసార్లు తనిఖీలు చేసినప్పటికీ నటుడు ఎలాంటి మార్పులు చేయలేదని.. ఆ కారణంగానే తాము జూహూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అధికారులు చెబుతున్నారు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై స్పందించిన సోనూసూద్.. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. కేవలంమహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుండి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందన్నారు. అది కూడా కోవిడ్ కారణంగా ఆలస్యమవుతుందని అన్నారు. ఒకవేళ అనుమతులు రాకపోతే భవనాన్ని తిరిగి నివాస సముదాయంగా మార్చేస్తానని చెప్పారు.