బాబీ డియోల్ (Bobby Deol ) .. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ విలన్. కొత్త సినిమా ఏదైనా స్టార్ట్ అవుతోంది అంటే విలన్‌గా ఆయన పేరే వినిపిస్తోంది. రీసెంట్‌గా వచ్చిన పెద్ద సినిమాల్లో ఆయన ఉన్నాడు కూడా. అలాంటి బాబీ డియోల్ రీసెంట్ లైఫ్ గురించి ప్రముఖ దర్శకుడు బాబీ (Bobby) చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిస్థితి నుండి ఎలాంటి పరిస్థితికి వచ్చారు. తిరిగి ఎలా కోలుకున్నారు అనే వివరాలను ఆయన వివరంగా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర నటవారసత్వంగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బాబీ డియోల్.
ఏడాదిలో 12 సినిమాలు చేసి స్టార్‌గా వెలుగొందాడు. అయితే ఓ లెవల్ వరకే ఆ స్టార్ డమ్ ఉంది. ఆ తర్వాత అమాంతం పడిపోయాడు. సినిమాలు లేకుండా నెలల తరబడి, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాడు. కచ్చితంగా లెక్క చెప్పాలంటే ఓ 15 ఏళ్లు. ఈ సమయంలో భార్య సంపాదన మీద ఫ్యామిలీ ముందుకెళ్లింది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇదంతా ‘యానిమల్’ (Animal) సినిమా వచ్చేంతవరకే. హీరోగా ఎందరో మనసుల్ని చూరగొన్న బాబీ డియోల్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చారు.
బాలీవుడ్‌లో బాబీ అంత బిజీ యాక్టర్ ఇప్పుడు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ‘డాకు మహరాజ్’ (Daaku Maharaaj) సినిమాలోనూ ఆయనే విలన్. ఆ సినిమా ప్రచారంలోనే దర్శకుడు బాబీ ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడు బాబీ డియోల్ దగ్గర సందీప్ రెడ్డి వంగా పేరు ప్రస్తావిస్తే ఎమోషనల్ అయిపోతున్నారట.
ఇప్పుడు ఆయన ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారని, అదంతా సందీప్ రాసిన పాత్ర వల్లనే అని చెబుతున్నారాయన. అలాగే ఆ సినిమా ఇచ్చిన హైప్‌ను దృష్టిలో పెట్టుకునే కొత్త పాత్రలు ఓకే చేస్తున్నారట. మరి ‘డాకు మహరాజ్’ కూడా విజయం అందుకుంటే ఇక బాబీని ఆపేవాళ్లే లేరు అని చెప్పొచ్చు. ఈ మాట ఇద్దరు బాబీలకు వర్తిస్తుంది.