దేశంలో సినిమా అనగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు.. బాలీవుడ్. అంతలా భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అనే మాట జనాల్లో ఫిక్స్ అయిపోయింది. అలాంటి పరిస్థితి రెండు విషయాల వల్ల మారిపోయింది. ఒకటి కరోనా పరిస్థితులు అయితే, రెండోది పాన్ ఇండియా సినిమాలు. అందులోనూ సౌత్ నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు. అయితే సౌత్ సినిమా సత్తా అంటే కిట్టని కొంతమంది బాలీవుడ్ జనాలు.. ఎప్పుడు సౌత్‌లో ఫ్లాప్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
అలాంటివారికి ‘లైగర్’ భలే అవకాశం ఇచ్చిందా? అవుననే అనిపిస్తోంది సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి. పాన్ ఇండియా సినిమా అందులోనూ సౌత్ నుండి రూపొందిన పాన్ ఇండియా సినిమా ఇది. ఆగస్టు 25న దేశాన్ని షేక్ చేస్తాం అంటూ విజయ్ దేవరకొండ ఈ రోజు వచ్చారు. తీరా ఫలితం చూస్తే.. ప్రచారం ఎక్కువ, పస తక్కువ అనిపిస్తోంది. మామూలుగా అయితే ఈ సినిమా బాగాలేదు, సరిగ్గా తీయలేదు, ఇంకా బాగా తీయాల్సింది అనే కామెంట్స్ వచ్చేవి.
అయితే సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చేలా సినిమా టీమ్ ఘనంగా దేశం మొత్తం తిరిగి మాట్లాడింది. ఇప్పుడు ఫలితం తేడా కొట్టేసరికి మీమర్స్, ట్రోలర్స్ జూలు విదిలించారు. దీనికి తోడు బాలీవుడ్ జనాలు కూడా సిద్ధమైపోయారు. బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఇటీవల కాలంలో ఏమంత బాలేదు. సౌత్ సినిమాలు, అందులోనూ పాన్ ఇండియా సినిమాలే ఆడుతున్నాయి అనే మాట బయటకు అంటున్నా.. బాలీవుడ్ జనాలు, మీడియా మాత్రం ఇబ్బందిగానే ఫీలవుతోంది అని అంటున్నారు. ఇప్పుడు ‘లైగర్’ పరిస్థితి తేడా కొట్టేసరికి వాళ్లంతా ‘సౌత్ సత్తా’ గురించి అక్కడక్కడ కామెంట్స్ చేస్తున్నారు.
ట్రోల్స్, మీమ్స్ పరిస్థితి చూస్తుంటే.. ‘లైగర్’ పరాజయం నొప్పి కంటే.. ఈ బాధే ఎక్కువ అయ్యేలా ఉంది. పరాజయాలు ఎరికైనా సాధ్యమే. అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, శాండిల్ వుడ్ అయినా, మాలీవుడ్ అయినా. కాబట్టి అక్కడి పరాజయాల్ని, ఇక్కడి విజయాల్ని కలిపేసి మనమే తోపు అంటే.. మన కిందపడే రోజు మనల్ని అనేవాళ్లకు బలం వస్తుంది. కాబట్టి సౌత్ సత్తా గురించి కొన్ని కామెంట్స్ కనిపించినా.. వాటిని తలదన్నేలా మరో పాన్ ఇండియా విజయంతో సమాధానం ఇవ్వాలి.