బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు కాగా ఈ హీరోయిన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ (Emergency) మూవీకి ఇప్పటికే సెన్సార్ ఇబ్బందులు ఎదురు కాగా బాంబే హైకోర్టులో సైతం షాక్ తగిలింది. ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ను ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది.
అయితే బాంబే హైకోర్టు సెప్టెంబర్ నెల 18వ తేదీలోపు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు సూచనలు చేయడం గమనార్హం. హైకోర్టు తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది. అనుపమ్ ఖేర్ (Anupam Kher), మహిమా చౌదరి (Mahima Chaudhry) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఒక వర్గం తమని తక్కువగా చూపించారని మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వివాదం చెలరేగింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ వర్గం వాదనలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు సూచనలు చేయడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్ ను నిలిపివేయాలని ఎస్.ఏ.డీ పార్టీ సైతం సెన్సార్ బోర్డును కోరడం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రేక్షకుల్లో ద్వేషాన్ని పెంపొందించేలా ఈ చిత్రం ఉందని చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించారని ఎస్.ఏ.డీ పార్టీ ఆరోపణలు చేసింది. కంగనాకు (Kangana Ranaut) వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ మూవీ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది.