ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అది. అయినా ఇప్పటికీ అందులో మూడు పాత్రల క్యారెక్టరైజేషన్స్ ఇప్పటికీ మన మనసులో ఉండిపోయాయి. ఎందుకంటే ఆ రెండూ మన ఇంట్లో, పక్కింట్లో, ఎదురింట్లో ఎక్కడో దగ్గర చూస్తూనే ఉంటాం. ఆ సినిమా ‘బొమ్మరిల్లు’ అయితే… ఆ పాత్రలు ప్రకాశ్‌రాజ్, సిద్ధార్థ, జెనీలియా. సినిమా అంతా ఈ ముగ్గురు చుట్టూనే నడుస్తుంది మరి. అందులో జెనీలియా పాత్రచిత్రణ అయితే మిలియన్ డాలర్ల హ్యాపీనెస్ ఇస్తుంది. మరి ఆ పాత్ర ఎలా పుట్టిందో తెలుసా?
‘ఆర్య’కు పని చేస్తున్నపుడే ఈ సినిమా హిట్టయితే దర్శకుడిగా అవకాశం ఇస్తానని బొమ్మరిల్లు భాస్కర్‌కి (అప్పటికే ఉత్తి భాస్కరే అనుకోండి) దిల్ రాజు చెప్పారట. అనుకున్నట్లే ఆ సినిమా హిట్టవ్వగా…. ‘కథ రెడీ చేసుకో’ అని భాస్కర్‌కి దిల్ రాజు సూచించారట. అలా రెండు కథలు చెబితే… ఇవన్నీ వద్దు మంచి ఫ్యామిలీ మూవీ చేద్దాం అన్నారట. అప్పుడు కొన్ని నిజ జీవిత సంఘటనలను బేస్ చేసుకొని ‘బొమ్మరిల్లు’ కథ చెప్పారట భాస్కర్. అయితే హీరోయిన్ పాత్ర గురించి ఇంకాస్త వర్క్ చేస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయట. దీంతో 15 రోజులు సమయం అడిగారట భాస్కర్.
ఆయన ఓకే అనడంతో… భాస్కర్, వాసు వర్మ కలసి ఆ పాత్ర గురించి కుస్తీలు పట్టారట ఇద్దరూ. 14 రోజులైనా పాయింట్ తట్టలేదట. దీంతోవ బాగా చిరాకు వచ్చిందట. అయితే 15వ రోజు వేకువజామున అంటే 16వ రోజు అనుకోండి. తెల్లవారుజామున 4 గంటలకు వాసుతో డిస్కస్ చేస్తూ ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటన చెప్పారట భాస్కర్. అదే ఓ అమ్మాయి అనుకోకుండా తలను గుద్దితే… కొమ్ములొస్తాయని మళ్లీ గుద్దడం. ఆ పాయింట్ పట్టుకొని రెండు గంటల్లో హాసిని పాత్ర మొత్తం రాసేశారట. అదన్నమాట హా హా హాసిని పాత్ర వెనుక జరిగింది.