బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మూడో సినిమాగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాపై రిలీజ్ కు ముందే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మగధీర తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడం, నాగబాబు నిర్మాతగా వ్యవహరించడం, ఆరెంజ్ మూవీలో అన్ని పాటలు రిలీజ్ కు ముందే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అందరూ భావించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఆరెంజ్ మూవీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కిస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బొమ్మరిల్లు సక్సెస్ తో ఆ సినిమానే తన ఇంటి పేరుగా మారిందని ప్రేక్షకులు తన నుంచి అదే స్థాయి సినిమాలు కోరుకోవడంతో ప్రతి సినిమా విషయంలో టెన్షన్ పడ్డానని అన్నారు. తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఆరెంజ్ మూవీకే ఎక్కువగా కష్టపడ్డానని స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరకపోవడం వల్లే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదని బొమ్మరిల్లు భాస్కర్ చెప్పుకొచ్చారు.
ఆరెంజ్ కథ చాలామందికి నచ్చిందని ఆరెంజ్ లాంటి సినిమాలు కావాలని తనను అడుగుతున్నారని బొమ్మరిల్లు భాస్కర్ వెల్లడించారు. మొదట ఒక లైన్ అనుకుని దానినే ఆరెంజ్ కథగా తీర్చిదిద్దానని ఆరెంజ్ కథలో పర్ ఫెక్షన్ కోసం రాత్రీపగలు కూర్చుని రాస్తూ ఉండేవాడినని బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు. నిర్మాతగా నాగబాబుకు ఆరెంజ్ సినిమా భారీగా నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.