ఈ మధ్య పెద్ద, మిడ్ రేంజ్ సినిమాలు ఏవీ కూడా ఎక్కువగా రిలీజ్ కావడం లేదు. థియేటర్స్ ఫిల్లింగ్ కోసం సరైన సినిమా లేక డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కంటెంట్ ఉన్న పరభాషా సినిమాలను కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పెద్ద సినిమాలకు తప్ప.. చిన్న మిడ్ రేంజ్ సినిమాలకు సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు తేజ సజ్జ సినిమాకి కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది.
విషయం ఏంటంటే.. తేజ సజ్జ హీరోగా ‘మిరాయ్’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకుడు. ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్నారు. తర్వాత ఆగస్టు 1కి మారింది. అటు తర్వాత సెప్టెంబర్ 5 కి మారినట్టు మేకర్స్ తెలిపారు. సో ‘ ‘మిరాయ్’ కి సోలో రిలీజ్ దొరికింది’ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే డేట్ అనుష్క ‘ఘాటి’ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి జూలై 11నే ‘ఘాటి’ రిలీజ్ కావాలి. కానీ వి.ఎఫ్.ఎక్స్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ‘సెప్టెంబర్ 5న వేసేద్దాం’ అని ‘ఘాటి’ మేకర్స్ కి చెప్పినట్టు సమాచారం.
మరో వారం రోజుల్లో ‘ఘాటి’ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘ఘాటి’ కి బిజినెస్ బాగానే జరిగింది. అనుష్క కాబట్టి టాక్ బాగుంటే కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయి. మరోపక్క ‘మిరాయ్’ టీజర్, ట్రైలర్ బాగున్నా.. టాక్ తేడా కొడితే ‘ఘాటి’ పై చేయి సాధించే అవకాశాలు ఉన్నాయి.