హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజాగౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “బ్రహ్మ ఆనందం” (Brahma Anandam). ఆర్.వి.ఎస్ నిఖిల్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్క రూపొందించిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా నేడు (ఫిబ్రవరి 14) విడుదలైంది. తాతామనవళ్ళ నడుమ సాగే ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
కథ: చిన్నప్పటినుండి తన అనుకునేవాళ్లందరూ దూరమవుతుండడంతో.. అందరికీ దూరంగా స్వార్థపరుడు అనే ముసుగులో బ్రతికేస్తుంటాడు బ్రహ్మానందం (రాజా గౌతమ్). తాను రాసుకున్న నాటకాన్ని నేషనల్ లెవల్లో ప్రదర్శించడానికి 6 లక్షల రూపాయలు కావాల్సి రావడంతో. వేరే దారి లేక తాతయ్య మూర్తి (బ్రహ్మానందం) ఇస్తానన్న పొలం కోసం అతనితో కలిసి పల్లెటూరికి వెళ్తాడు.
కట్ చేస్తే.. తాతకి పొలం లేదని, గట్టిగా అడిగితే ఆ ఊరితో సంబంధమే లేదని తెలుసుకుంటాడు బ్రహ్మానందం. మరి మూర్తి ఎందుకు అబద్ధం చెప్పాడు? అసలు ఆ ఊరు ఎందుకు వచ్చాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “బ్రహ్మ ఆనందం” చిత్రం.
నటీనటుల పనితీరు: ఒక నటుడిగా బ్రహ్మానందం ప్రతిభను పొగిడే లేదా విమర్శించే స్థాయి నాకు లేనప్పటికీ, ఆయన పండించే హావభావాల్లో పులకించిన అనుభవంతో చెప్పగలిగేదేమిటంటే.. ఈ సినిమాలో ఆయన నట పాఠవాన్ని సరైన స్థాయిలో వినియోగించుకోలేదు అని చెప్పాలి. లిప్ సింక్ లేని సన్నివేశాల గురించి పక్కన పెడితే.. బ్రహ్మానందం ఎంతో అద్భుతంగా పలికించే హావభావాలను కూడా సరిగా వాడుకోలేకపోయారు. అందువల్ల.. బ్రహ్మానందం అనే ఓ అత్యంత నైపుణ్యవంతుడైన నటడు పోషించిన పాత్ర యొక్క బాధను, భావోద్వేగాన్ని ప్రేక్షకుడు అనునయించుకోలేక ఇబ్బందిపడతాడు.
రాజా గౌతమ్ కొన్ని సన్నివేశాల్లో చక్కని పరిణితి ప్రదర్శించిన విషయం నిజమే. అయితే.. సినిమా మొత్తం ఒకే రకమైన ఎమోషన్ ను క్యారీ చేశాడు, అతడిలోని డిటాచ్మెంట్ ఇష్యూస్ ను సరిగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. అదే విధంగా రాజా గౌతమ్, బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ లో ఇంకాస్త ఎమోషన్స్ పండి ఉంటే బాగుండేది. అది లోపించడంతో వారి నడుమ సాగే సన్నివేశాల్లో ఎక్కడా సరైన కనెక్టివిటీ కనిపించలేదు.
వెన్నెల కిషోర్ పాత్ర వ్యవహారశైలిని కాస్త ప్రోపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే.. అతడి పాత్రతో పండిన కామెడీ సెకండాఫ్ లో బాగున్నా.. ఫస్టాఫ్ లో ఎందుకు, ఏమిటి అనే క్లారిటీ లేక సరిగా వర్కవుట్ అవ్వలేదు.
ప్రియ వడ్లమాని మంచి పాత్రలో, మంచి నటనతో ఆకట్టుంది. దివిజ ప్రభాకర్ కి కెమెరా కానీ, సినిమా కానీ కొత్త కాకపోవడంతో అందరితో సమానమైన ఈజ్ తో అలరించింది. సరైన పాత్రలు ఎంచుకుంటే.. క్యారెక్టర్ ఆరిస్ట్ గా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తాళ్లూరి రాజేశ్వరి మంచి పాత్ర పోషించారు. అయితే.. ఆమె పాత్ర విషయంలో కూడా ఎస్టాబ్లిష్మెంట్ మిస్ అయ్యింది. అందువల్ల.. ఆ పాత్ర అలా ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చింది, సదరు నిర్ణయం ఎందుకు తీసుకుంది? అనేది సరిగా ఎలివేట్ అవ్వలేదు.
రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, ఐశ్వర్య తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఆర్.వి.ఎస్ నిఖిల్ కి దొరికిన గోల్డెన్ ఛాన్స్ “బ్రహ్మ ఆనందం”. బ్రహ్మానందాన్ని ఆయన కొడుకుతో కలిసి డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అతడు ఎంచుకున్న కోర్ పాయింట్ కూడా బాగుంది. అయితే.. ఆ కోర్ పాయింట్ కు సపోర్టింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ.. సరైన క్యారెక్టర్ ఆర్క్స్ కానీ లేవు. అలాగే.. అతి ముఖ్యమైన డ్రామా లేదు. ఆ కారణంగా “బ్రహ్మ ఆనందం” చాలా పేలవమైన సినిమాగా మిగిలిపోయింది.
ఇంటర్వెల్ ట్విస్ట్ ముందు ఫిక్స్ అయిపోయి దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకోవడం అనేది స్క్రీన్ ప్లే విషయంలో దొర్లిన పెద్ద తప్పు. ఆ ట్విస్ట్ ను రివీల్ చేసిన తీరులో కూడా ఆసక్తి లోపించింది. ఇంచుమించుగా ఇదే స్థాయి కోర్ పాయింట్ ను “చందమామ కథలు” చిత్రంలో ప్రవీణ్ సత్తారు ఇంకా మెచ్యూర్డ్ గా ట్రీట్ చేశాడు. దర్శకుడు నిఖిల్ తడబాటు అక్కడ స్పష్టంగా కనిపించింది. అందువల్ల దర్శకుడిగా కానీ కథకుడిగా కానీ నిఖిల్ ఆకట్టుకోలేకపోయాడు.
సంగీత దర్శకుడు శాండిల్య పిసపాటి ఈ సినిమాకి 100% న్యాయం చేసిన ఏకైక టెక్నీషియన్. పాటలు వినసొంపుగా ఉన్నాయి, నేపథ్య సంగీతంలో హాస్యాన్ని, ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేశాడు కూడా. సంగీత దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంది.
మితేష్ ఫ్రేమింగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా.. టైట్ క్లోజ్ షాట్స్ & వైడ్ యాంగిల్ షాట్ లో కెమెరా ప్లేస్మెంట్ బాగుంది. అయితే. కలర్ టోన్ విషయంలో కన్సిస్టెన్సీ మిస్ అయ్యింది.
ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్స్ గురించి పెద్దగా మాట్లాడుకునే స్థాయిలో ఏమీ లేదు. కాకపోతే.. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చుట్టేశారనేది మాత్రం అర్థమవుతుంది.
విశ్లేషణ: తండ్రీకొడుకులను తెరపై తాతామనవళ్లుగా చూపించడం అనేది పెద్ద విషయం. అది కూడా అందరూ ఎంతో ఆప్యాయంగా “హాస్యబ్రహ్మ” అని పిలుచుకునే బ్రహ్మానందంను, ఆయన కుమారుడు రాజాగౌతమ్ ను ఈ విధంగా చూపించడానికి ఒప్పించడమే దర్శకుడు సాధించిన మొట్టమొదటి విజయం. అలాగే.. ఎంచుకున్న ఒక మంచి కోర్ పాయింట్ తో రెండో విజయం సాధించాడు. అయితే.. ఆ కాంబినేషన్ ను, కోర్ పాయింట్ ను బ్యాలెన్స్ చేసే డ్రామా మరియు కథనం విషయంలో తడబడ్డాడు.
ఆ కారణంగా అందరి హృదయాల్లోకి చొచ్చుకుపోవాల్సిన “బ్రహ్మ ఆనందం” అనే చిత్రం ఓ సగటు ఎమోషనల్ డ్రామాగా మిగిలిపోయింది. దర్శకుడు ఆర్.వి.ఎస్ నిఖిల్ కథనంపై ఏమాత్రం శ్రద్ధ చూపించినా ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేది. అయితే.. బ్రహ్మానందం స్క్రీన్ ప్రెజన్స్ & శాండిల్య నేపథ్య సంగీతం కోసం ఈ చిత్రాన్ని ఓసారి థియేటర్లలో కుటుంబంతో కలిసి చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: అర్ధ ఆనందం!
రేటింగ్: 2/5