ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. డబ్బు చెల్లించి ఈ యాప్ ద్వారా సినిమా చూడొచ్చు. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అడల్ట్ కంటెంట్‌తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో పెద్ద హోర్డింగ్స్, పోస్టర్లను అతికిస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి మెట్రో పిల్లర్లపై ఇటీవల అతికించిన ఈ సినిమా పోస్టర్లు స్త్రీలను అవమానించేలా.. అగౌరవపరిచేలా ఉన్నాయని.. అంతేగాక యువతను తప్పదోవ పట్టించే విధంగా ఆసభ్యకరమై ఆశ్లీల చిత్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీపై ఐపీసీ సెక్షన్ 292 చట్టం కింద మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అయితే ఈ విధంగా సినిమా పోస్టర్ల వలన నిర్మాతలపై కేసులు నమోదు కావడం ఇదేమీ కొత్తకాదు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో కూడా నిర్మాతలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు.