‘ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనేది ఖచ్చితంగా చెప్పలేము..! ఈ మధ్యనే ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒకప్పుడు హిందూ పండిట్లను.. ముస్లింలు ఎలా చంపారో చూపించారు. ఇటీవల ఓ బండిలో గోవులను తీసుకెళ్తుంటే ముస్లిం వ్యక్తిని కొట్టి జై శ్రీరామ్ అన్నారు. మరి ఇదేంటి? అది మత ఘర్షణ అయితే ఇది కూడా మత ఘర్షణే అవుతుంది. మతాలు కాదు మనం మంచిగా ఉండాలి. మనలో మంచి అనేది ఉంటే ఇతరులను బాధించం.
లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం కరెక్ట్ గా లేకపోతే ఎక్కడా న్యాయం దొరకదు’ .. ఇవి ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్. ‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా థీమ్ గురించి చెబుతూ ఈ కామెంట్స్ చేసింది. కానీ ఇవి వివాదాస్పదమయ్యాయి. ఏకంగా భజరంగ్ దళ్ నాయకులు వచ్చి కేసు పెట్టే వరకు వెళ్ళింది వ్యవహారం.
గో రక్షకులను కశ్మీర్ తీవ్రవాదులతో పోల్చడం ఏంటి అనే అంశం పై వీళ్ళు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి పై కేసు నమోదైంది. ఆమె చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పి… ఆ కామెంట్లను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు న్యాయపరమైన నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి వారు ఫిర్యాదుని స్వీకరించినట్లు తెలుస్తుంది. అయితే సాయి పల్లవి ఈ వివాదం పై స్పందిస్తూ..
‘నేను నా ‘విరాటపర్వం’ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ విషయంపై స్పందించను. ఎందుకంటే నా సినిమా ప్రమోషన్ కోసం ఆ వివాదాన్ని వాడుకుంటున్నట్టు అంతా అనుకుంటారు. కానీ కచ్చితంగా ఈ విషయంపై స్పందిస్తాను. సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజుల తర్వాత స్పందిస్తాను. నా అభిమానులు ఈ ఇష్యు నుండి బయటపడేయాలని చూస్తున్నారు. వారి థాంక్స్ కానీ ఎక్కువగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.