పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా యాభై కోట్ల రూపాయలను వసూలు చేసి సత్తా చాటింది. అయితే తాజాగా ఈ సినిమా దర్శకనిర్మాతలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే.. ‘వకీల్ సాబ్’ సినిమాలో హీరోయిన్ అంజలిని వేధించే సన్నివేశాల్లో ఆమె హాట్ ఫోటో పెట్టి ఫోన్ నెంబర్ షేర్ చేస్తారు.
ఈ సినిమాను చూసిన కొందరు వ్యక్తులు ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి తరచూ అమ్మాయిలు కావాలని వేధిస్తున్నారట. దీంతో ఆ ఫోన్ నెంబర్ ఉపయోగిస్తున్న వ్యక్తి తాజాగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ వాడారని.. దాంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని చెప్పాడు. రాత్రి సమయంలో కొందరు ఫోన్లు చేసి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని బాధితుడు వాపోయాడు.
దీంతో ఈ సినిమాపై తాను పరువు నష్టం దావా వేస్తానని తెలిపాడు. అయితే ఈ ఫోన్ నెంబర్ కాంట్రవర్సీపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ స్పందించలేదు. గతంలో నాని నటించిన ‘వి’ సినిమా విషయంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ముంబైకి చెందిన మోసాలు సాక్షి మాలికి పేరుని ఓ సన్నివేశంలో ఉపయోగించడంతో ఆమె కోర్టుకెక్కింది. దీంతో ఆ సన్నివేశంలో ఆమె పేరుని తొలగించాలంటూ కోర్టు చిత్రయూనిట్ కి సూచించింది. మరి ఇప్పుడు ‘వకీల్ సాబ్’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!