ఇటీవల టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాలో బుల్లిరాజు పాత్ర ఆడియన్స్ ని తెగ నవ్వించింది. సినిమాలో అతని తండ్రి “మావాడు ఓటీటీలో (OTT) వెబ్ సిరీస్‌లు చూసి పాడైపోయాడు!” అని చెప్పే డైలాగ్ కాస్తా రియల్ లైఫ్‌లోనూ హాట్ టాపిక్ అయ్యింది. నిజంగానే, ఓటీటీల్లో పిల్లలకు అనుకూలం కాని కంటెంట్ ఎక్కువవుతోందన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఐటీ నియమాలు (2021) ప్రకారం వయస్సు ఆధారిత కంటెంట్ వర్గీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ముఖ్యంగా, “ఏ” రేటెడ్ కంటెంట్ అందుబాటులోకి రావడానికి యూజర్ వయస్సు ధృవీకరణ అమలు చేయాలని, పిల్లలు సులభంగా ఆ కంటెంట్‌ను చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇటీవల ఓ స్టాండ్ అప్ కామెడీ షోలో పాడ్‌కాస్టర్ రణవీర్ చేసిన అసభ్య వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, కేంద్రం ఈ చర్యలు మరింత కఠినతరం చేసింది.
ఆ వీడియోలు యూట్యూబ్‌లో కంటెంట్ రిమూవ్ చేయమని ఆదేశించినప్పటికీ, వాటిని వెంటనే తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కు నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టపరంగా నిషేధిత కంటెంట్ ప్రసారం చేయవద్దని, కంటెంట్ నైతిక విలువలకు అనుగుణంగా ఉండాలని సూచించింది. ఫిల్టర్ లేకుండా కంటెంట్ విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించింది.
సమంత (Samantha) ఫ్యామిలీ మ్యాన్ 2, మిర్జాపూర్, స్కామ్ 2003 వంటి వెబ్ సిరీస్‌లు పెద్ద హిట్స్ అయినప్పటికీ, వాటిలోని అనుచిత సన్నివేశాలు ఎప్పటికప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. అందుకే, బుల్లిరాజు డైలాగ్ తో మొదలైన చర్చ, ఇప్పుడు కేంద్రం స్పందనకు దారితీసింది. చూడాలి, ఈ నిబంధనల తర్వాత ఓటీటీలు ఎలాంటి మార్పులు చేసుకుంటాయో.