స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) పై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ విడుదల తేదీని డిసెంబర్ 5కి మార్చినట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అయితే, డిసెంబర్ 6న విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక యుద్ధ చిత్రం ‘చావా’ (Chhaava) కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాలు ఒకే వారం బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.
‘పుష్ప 2’ క్రేజ్ ని చూసి, చావా చిత్ర బృందం తమ సినిమాను వాయిదా వేయవచ్చు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, చావా మూవీ బృందం మాత్రం తమ సినిమా విడుదల తేదీని మార్చే ప్రసక్తే లేదనేల హడావుడి చేస్తోంది. వారు తమ నిర్ణయంలో బలంగా ఉండడంతో, ఈ రెండు చిత్రాల మధ్య పోటీ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇద్దరు ప్రొడ్యూసర్లూ విడుదల తేదీలను మార్చకుండా ఒకే వారం పోటీకి రావడం, అంత మంచిది కాదు.
డిసెంబర్ 6 సెలవు రోజు కాకపోవడంతో, రెండు సినిమాలకు కూడా వ్యాపార పరంగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో విడుదలైన మొదటి చిత్రం ప్రారంభ వసూళ్లలో శాతం ఎక్కువగా సంపాదించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు, అయితే రెండు సినిమాల పోటీ వల్ల, వసూళ్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో చావా సినిమాకి మంచి మార్కెట్ ఉందని చెబుతున్నారు.
ఈ కథ ఛత్రపతి శివాజీ వారసుడి జీవిత కథ ఆధారంగా ఉండటంతో సెంటిమెంట్ వర్కౌట్ అయితే మంచి వసూళ్లు రాబట్టవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ‘పుష్ప 2’కి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండటం వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీ డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా కొంత నష్టాన్ని కలిగించవచ్చని పరిశ్రమలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు చర్చల ద్వారా ఏమైనా మార్పులు తీసుకు వస్తారేమో చూడాలి.