Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!
- January 23, 2026 / 07:00 AM ISTByDheeraj Babu
Cast & Crew
- విశ్వదేవ్ రాచకొండ (Hero)
- శోభిత ధూళిపాళ (Heroine)
- వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ, విషిక, అదితి మ్యాకల్, ఈషా చావ్లా తదితరులు (Cast)
- శరణ్ కొప్పిశెట్టి (Director)
- డి.సురేష్ బాబు (Producer)
- శ్రీచరణ్ పాకాల (Music)
- మల్లిఖార్జున్ (Cinematography)
- కె.ఎస్.ఎన్ (Editor)
- Release Date : జనవరి 23, 2026
- అమెజాన్ ప్రైమ్ (Banner)
శోభిత ధూళిపాళ తెలుగులో నటించిన మొట్టమొదటి వెబ్ ఫిలిం “చీకటిలో”. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి క్యూరియాసిటీ పెంచింది. మరి సినిమా అదే స్థాయిలో ఆకట్టుకుందా? లేదా? అనేది చూద్దాం..!!
Cheekatilo Movie Review

కథ: సిటీలో ఒక పాపులర్ ఛానల్ ఎంప్లాయి అత్యంత భయానకంగా హత్య చేయబడుతుంది. హత్యకి ముందు ఆమెను కిరాతకంగా అనుభవించినట్లుగా గుర్తిస్తారు పోలీసులు. చనిపోయింది తన స్నేహితురాలు కావడంతో ఈ కేసును సాల్వ్ చేసేందుకు రంగంలోకి దిగుతుంది సంధ్య (శోభిత ధూళిపాళ).
ఆ హంతకుడికి ఇది మొదటి హత్య కాదని, ఇదివరకు కూడా అలాంటివి చాలా చేసాడని తెలుసుకొని, సదరు ఇన్సిడెంట్స్ మీద ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఆడియో పాడ్కాస్ట్ ద్వారా ఆ హంతకుడిని చీకటిలో నుండి బయటికి తీసుకురావాలి అనేది సంధ్య ఆశయం.
అయితే.. దాన్ని ఛాలెంజ్ గా భావించిన హంతకుడు సంధ్యకు, పోలీసులకు సవాళ్లు విసరడం మొదలెడతాడు.
ఎవరా హంతకుడు? ఎందుకని ఇలా హత్యలు చేస్తున్నాడు? అతడ్ని సంధ్య పట్టుకోగలిగిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “చీకటిలో” చిత్రం.

నటీనటుల పనితీరు: సాధారణంగా హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించారు, చక్కగా నటించారు లేదా పాత్రని బాగా ప్రెజెంట్ చేశారు అని చెబుతుంటాం. కానీ.. చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది మాత్రం ఈ సినిమాలోనే. శోభిత కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్ లో, నడవడికలో ఒక నిశ్చలమైన ఆత్మస్థైర్యం కనిపించింది. డైలాగ్ డెలివరీ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఒక మాట ఎక్కువ లేదు, ఒక మాట తక్కువ లేదు. నటిగా ఆమెకు మంచి పేరు తీసుకురావడంతోపాటుగా ఆమెను మరిన్ని స్త్రీప్రధాన సినిమాలకి కన్సిడర్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇప్పటివరకు కామెడీ లేదా క్యారెక్టర్ రోల్స్ లో చూసిన వడ్లమాని శ్రీనివాస్ ఈ సినిమాలో ఆశ్చర్యపరుస్తాడు. అతని పాత్ర ఏంటి అనేది చెప్పలేం కానీ.. అతని కెరీర్ గ్రాఫ్ ఈ సినిమాతో మారిపోతుంది.
చైతన్య కృష్ణ, ఈషా చావ్లా, సీనియర్ యాక్టర్ సురేష్ లను చాలారోజుల తర్వాత సీరియస్ క్యారెక్టర్ లో చూడడం సంతోషం.
విశ్వదేవ్ రాచకొండ, అదితి మ్యాకల్, విషిక, రవీంద్ర విజయ్ లు తమ నటనతో కథా గమనానికి ప్లస్ అయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు: శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకి కావాల్సిన థ్రిల్ ఫీల్ ను ఇవ్వగా.. ఉన్న రెండు పాటలు కూడా కథను ఎలివేట్ చేయడంలో ఉపయోగపడ్డాయి.
ఎడిట్ స్టైల్ బాగుంది. ముఖ్యంగా ట్రాన్సిషన్స్ ఫార్మాట్ కొత్తగా ఉంది. మ్యూజిక్ బీట్ కి తగ్గట్లుగా షాట్స్ ను ప్లాన్ చేయడం మంచి ఎగ్జైట్మెంట్ ఇచ్చింది.
ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇన్వెస్టిగేషన్ కోసం కలెక్ట్ చేసే ఫైల్స్ & డాటాను పక్కాగా రీక్రియేట్ చేశారు. ముఖ్యంగా డెడ్ బాడీస్ & క్రైమ్ స్పాట్ ను క్రియేట్ చేసిన తీరు చాలా సహజంగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కూడా మంచి కేర్ తీసుకున్నారు.
సినిమాటోగ్రాఫర్ మల్లిఖార్జున్ ఫ్రేమింగ్స్ బాగున్నాయి. లైటింగ్ ను బాగా వినియోగించుకున్నాడు. అయితే.. DI విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఈ తరహా కథలకి పిక్చర్ క్వాలిటీలో షార్ప్ నెస్ చాలా అవసరం. అది మిస్ అయ్యింది.
చంద్ర పెమ్మరాజు రైటింగ్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా డీల్ చేశాడు.
చంద్ర పెమ్మరాజు రైటింగ్ ని అంతే కేర్ ఫుల్ గా డీల్ చేశాడు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. ముఖ్యంగా సినిమాలో అవసరానికి మించి శృంగార సన్నివేశాలు ఇరికించడానికి కావాల్సినంత స్కోప్ ఉన్నప్పటికీ.. ఎక్కడా పరిధి దాటకుండా, ప్రేక్షకులకు కేవలం ఆ సందర్భం తాలూకు తీవ్రత తెలిసేలా సన్నివేశాలని కంపోజ్ చేసుకున్న తీరు ప్రశంసార్హం. అలాగే.. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ క్రియేట్ చేసి, దాన్ని జస్టిఫై చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు శరణ్. అన్నిటికీ మించి క్యాస్టింగ్ విషయంలో తీసుకున్న కేర్ ప్రెడిక్టబ్లిటీని కంట్రోల్ చేసింది.
అలాగే.. సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ ను అండర్ లేయర్ గా డీల్ చేసిన తీరు, ఉమెన్ ఉబ్యూజ్ ను సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ఎలా లైట్ తీసుకుంటారు, ఒక అమ్మాయి బలంగా నిలబడడం సమాజానికి ఎంత అవసరం అనేది తెలియజెప్పిన విధానం కూడా బాగుంది. ఓవరాల్ గా.. దర్శకుడిగా శరణ్ కొప్పిశెట్టి 100% మెప్పించాడు అని చెప్పొచ్చు.

విశ్లేషణ: పరభాషా థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నప్పుడు.. మన తెలుగులో ఎందుకిలా సెన్సియర్ గా థ్రిల్లర్స్ తీయరు అని తిట్టుకున్నవాళ్లందరికీ సమాధానమే “చీకటిలో”. చంద్ర పెమ్మరాజు కథ-కథనం, శరణ్ కొప్పిశెట్టి దాన్ని తనదైన శైలిలో డీల్ చేసిన తీరు, శోభిత పాత్రను ఓన్ చేసుకుని నటించిన విధానం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్.
తెలుగులో వచ్చిన ఒన్నాఫ్ ది ఫైనెస్ట్ థ్రిల్లర్ గా “చీకటిలో” సినిమాని పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్నిటికీ మించి హింస, బలవంతపు శృంగారం అనేది ఎక్కడా మచ్చుకకైనా పరిధి దాటకుండా తెరకెక్కించబడటం అనేది ఈ వెబ్ ఫిలింను ప్రైమ్ వీడియోలో యాప్ లో కుటుంబం అందరూ కలిసి చూసేందుకు దోహదపడింది.

ఫోకస్ పాయింట్: ఎంగేజింగ్ & ఎగ్జైటింగ్ థ్రిల్లర్!
రేటింగ్: 3.5/5














