చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉన్న రాహుల్ రవీంద్రన్ హీరోగా తన కెరీర్ కు కామా పెట్టి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం “చిలసౌ”. సుశాంత్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ జనాల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సినిమా చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున “చిలసౌ” చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుంచి విడుదల చేస్తుండడం విశేషం, మరి నాగార్జున ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేసిన “చిలసౌ” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొంది? అనేది సమీక్షలో తెలుసుకొందాం..!!
కథ : ఇంట్లో తల్లిదండ్రులు మొదలుకొని స్నేహితులు, బంధువులు అందరూ “పెళ్ళెప్పుడు చేసుకొంటావ్?” అని అడుగుతుంటే తప్పించుకొని తిరగలేక, వాళ్ళు పీకే క్లాస్ లకు లోబడి పెళ్లి చేసుకోలేక “దయచేసి ఒక అయిదేళ్లు నన్ను వదిలేయండి” అంటూ తప్పించుకొని తిరిగే 27 ఏళ్ల కుర్రాడు అర్జున్ (సుశాంత్). తల్లి (అను హాసన్) పోరు భరించలేక ఇంట్లో ఏర్పాటు చేసిన పెళ్లిచూపులకి హాజరవుతాడు అర్జున్.
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఎవరి అండా లేకుండా స్వశక్తితో ఎదిగిన అమ్మాయి అంజలి (రుహానీ శర్మ). తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా.. తన కుమార్తెకు వస్తున్న సంబంధాలన్నీ కేవలం తనకున్న బైపోలార్ (కొన్ని విషయాలకి అతిగా స్పందించడం) అనే మానసిక రుగ్మతి కారణంగానే పాడవుతున్నాయనే తల్లి (రోహిణి) బాధపడడం చూసి తట్టుకోలేక అర్జున్ ను కలవడానికి వస్తుంది అంజలి.
ఇలా తల్లిదండ్రుల కోసం పెళ్లి ఇష్టం లేకపోయినా పెళ్ళిచూపుల కోసం కలిసిన అర్జున్-అంజలి జీవితాల్లో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ ఏం జరిగింది? పెళ్లి చూపులు సక్సెస్సా లేక ఫెయిలా? అనేది “చిలసౌ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : 2008లో “కాళిదాసు” చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన సుశాంత్ ఈ పదేళ్ళలో నటించిన సినిమాలు నాలుగే. అయిదో సినిమా “చిలసౌ”. అయితే.. సుశాంత్ ఒక మంచి నటుడు అని ప్రూవ్ చేసిన సినిమా మాత్రం “చిలసౌ”. ఓ ఆధునిక యువకుడిగా సుశాంత్ పాత్రలో ఒదిగిపోయాడు. క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ ను తన బాడీ లాంగ్వేజ్ తో స్క్రీన్ పై ప్రెజంట్ చేశాడు. ముఖ్యంగా.. ఒక కన్ఫ్యూజ్డ్ యంగ్ మేన్ గా సుశాంత్ నటనకు, పాత్రకు చాలా మంది కనెక్ట్ అవుతారు. ఇక ఇంట్లో “పెళ్లి చేసుకో?” అనే పోరుపడలేక బాధపడుతున్న ప్రతి ఒక్క యువకుడు ఈ పాత్రలో తనను తాను చూసుకొంటాడు.
సాధారణంగా సినిమాలో కొందరు హీరోయిన్లను చూస్తే.. పక్కింటి అమ్మాయిలే ఉందే అనే భావన కలుగుతుంది. కానీ.. ఈ చిత్రంలో రుహానీ శర్మను చూస్తే మాత్రం “అరే మన ఇంట్లో అమ్మాయిలా ఉందే” అనిపిస్తుంది. ఆమె మాట్లాడే విధానం, వ్యవహార శైలి అంత రియలిస్టిక్ గా ఉంటాయి. రాహుల్ రాసుకొన్న ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్ లో రుహానీ శర్మ జీవించింది. తెలుగు తెరకు రుహానీ అనే మంచి నటి పరిచయమైంది. అను హాసన్ ట్రెండీ మమ్మీగా ఆకట్టుకోగా.. రోహిణి మాత్రం సెన్సిబుల్ మదర్ గా అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూస్తే “ఇంత అద్భుతమైన నటినా మనోళ్ళు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లా చూస్తున్నారు?” అని ఆశ్చర్యపడడం ఖాయం. ఆమె కళ్ళల్లో కనిపించే బాధ, ఆనందం ప్రేక్షకుడు కూడా అనుభూతి చెందుతాడు, ఇంతకంటే ఒక నటి జనాల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి ఏం కావాలి చెప్పండి.
వెన్నెల కిషోర్ “అమీ తుమీ” తర్వాత తన నటనతో పూర్తి స్థాయిలో ఈ చిత్రంలో నవ్వించాడు. ఉన్న నాలుగు సన్నివేశాల్లోనే కడుపుబ్బ నవ్వించాడు వెన్నెల కిషోర్. 14 అంతస్తుల మెట్లు ఎక్కే సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఇప్పటివరకూ విద్యుల్లేఖ రామన్ పర్సనాలిటీని బేస్ చేసుకొని మాత్రమే కామెడీ క్రియేట్ చేయడం చూసి ఉంటాం. కానీ మొదటిసారి ఆమె పర్సనాలిటీని కాకుండా ఆమెలోని నటిని వినియోగించుకొన్న చిత్రం “చిలసౌ”. పోలీస్ గా చాలా చిన్న పాత్రలో రాహుల్ రామకృష్ణ కూడా ఆకట్టుకొన్నాడు.
సాంకేతికవర్గం పనితీరు : ప్రశాంత్ విహారీ మరోసారి తనదైన మృధువైన బాణీలతో, సుమధురమైన నేపధ్య సంగీతంతో సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేశాడు. వాయిద్యాల మోత కాకుండా సాహిత్యాన్ని ప్రేక్షకుడు ఆస్వాదించేలా చేయడం అనేది ప్రశాంత్ విహారీ ప్రత్యేకత. అందుకే ప్రశాంత్ విహారీ స్వరపరిచిన పాటల్లో సాహిత్యం పామరుడికి సైతం అర్ధమవుతుంది, పాటలోని భావాన్ని ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. “చిలసౌ” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణల్లో ప్రశాంత్ విహారీ సంగీతం, నేపధ్యం సంగీతం కూడా నిలుస్తుంది.
సుకుమార్ సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంది. ఎక్కడా అనవసరమైన లైటింగ్, డి.ఐ కానీ కనిపించదు. హీరో పాయింటాఫ్ వ్యూ లో కథ నడుస్తోంది, అతని పెర్స్పెక్టివ్ లోనే కథ సాగుతోంది అనే విషయాన్ని “ఫాలో అప్ షాట్స్”తో అందరికీ అర్ధమయ్యేలా చెప్పడం బాగుంది. దర్శకుడు రాహుల్ పేపర్ పై రాసుకొన్న కథను తెరపై చూపించాడు సుకుమార్. ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ ని కూడా మెచ్చుకోవాలి. స్ట్రయిట్ స్క్రీన్ ప్లే అయినప్పటికీ.. ఇద్దరు వ్యక్తుల పాయింటాఫ్ వ్యూలో సాగే కథనాన్ని ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా కట్ చేశారు. కొన్ని షాట్స్ లో “ఇలా సాగదీయడం అవసరమా అనిపించిన మరు నిమిషంలోనే.. ఓహో దీని ఉపయోగం ఇదా” అని ప్రేక్షకులు అర్ధం చేసుకొనేలా ఎడిట్ చేశారు ఛోటా కె.ప్రసాద్.
ఇక దర్శకుడిగా ఆశ్చర్యపరిచిన రాహుల్ రవీంద్రన్ గురించి చెప్పుకోవాలి.. అతను హీరోగా నటించిన “హైద్రాబాద్ లవ్ స్టోరీ, హౌరా బ్రిడ్జ్” లాంటి సినిమాలు వరుసబెట్టి డిజాస్టర్లుగా నిలవడం ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో హీరోగా కెరీర్ ను నెట్టుకురావడం కష్టమై దర్శకుడిగా మారాడేమో అనుకొన్నవాళ్లలో నేను ఒకడ్ని. అలాంటిది మొదటి 5 నిమిషాల హీరో ఇంట్రడక్షన్ షాట్ & సీన్స్ పిక్చరైజేషన్ తోనే నా ఆలోచన తప్పు అని ప్రూవ్ చేశాడు రాహుల్. అతడిలో మంచి ఆర్టిస్టిక్ వ్యూ ఉంది, అది ఈ సినిమాతో అందరికీ తెలుస్తుంది.
హీరో, హీరోయిన్ల పాత్రలు మాత్రమే కాదు సినిమాలోని ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ ను రాహుల్ రాసుకొన్న విధానం, నటీనటుల నుంచి సహజమైన నటన రాబట్టుకొన్న తీరు చూస్తే “ఇది దర్శకుడిగా రాహుల్ మొదటి సినిమానా?” అని ఆశ్చర్యపోక తప్పదు. దర్శకుడిగా మాత్రమే కాక రచయితగానే ఆకట్టుకొన్నాడు రాహుల్. ప్రాసల జోలికి పోకుండా మనం రెగ్యులర్ గా ఎలా మాట్లాడుకొంటామో అలాంటి సంభాషణలతోనే ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా “ప్రేమకంటే కష్టమైంది అలవాటు, నువ్ వెనక్కి రావడం నాకు నచ్చుతుంది కానీ.. ఆ నచ్చడం నాకు నచ్చడం లేదు” అనే మాటలతో ఒక అమ్మాయి అబ్బాయి మీద పెంచుకొనే ప్రేమను చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు.
మొదటి సినిమా కదా అని రాహుల్ ఎక్కడా సేఫ్ గేమ్ ఆడలేదు, సినిమాలో ఎక్కడా కూడా కామెడీ కోసం ఎపిసోడ్స్ క్రియేట్ చేయలేదు, పాటల కోసం సిచ్యుయేషన్ సృష్టించలేదు, ఎమోషన్స్ కోసం సెంటిమెంట్స్ ను వాడుకోలేదు. ఓ ఇద్దరి జీవితాల్ని, వారి కుటుంబాల్ని, వ్యవహారాల్ని సహజంగా తెరకెక్కించాడు. అందుకే.. సినిమా చూస్తున్నంతసేపూ.. ప్రేక్షకుడు టైమ్ చూసుకోడు, మరీ ఆపకుండా మోగితే తప్ప ఫోన్ చెక్ చేసుకోడు, ఇక దిక్కులు చూడడం అనేది మర్చిపోతాడు. సినిమాలో లీనమైపోతాడు. పాత్రలతో ప్రయాణిస్తాడు. సరదాగా సినిమా చూడడం కోసం థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు ఇంతకుమించి ఏం ఆశిస్తాడు చెప్పండి.
విశ్లేషణ : సుశాంత్ ట్రాక్ రికార్డ్ కారణంగా సినిమాకి ప్రారంభ వసూళ్లు కాస్త తక్కువగానే ఉండొచ్చు కానీ.. మల్టీప్లెక్స్ మరియు ఓవర్సీస్ లో భారీ విజయం సాధించే స్టామినా ఉన్న సినిమా “చిలసౌ”. కరెక్ట్ గా ప్రమోట్ చేసుకొని సినిమా జనాలకి చేరువైతే ఈవారం విడుదలైన అన్నీ సినిమాల కంటే పెద్ద విజయం సాధించే లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఒక చక్కని చిత్రాన్ని చూశామన్న అనుభూతి కోసం “చిలసౌ” చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా చూడొచ్చు.
రేటింగ్ : 3.5/5