హృదయకాలేయం చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఏర్పర్చుకున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు. తన దైన పాత్రలతో, వైవిధ్యమైన గెటప్పులతో అలరిస్తున్నాడు. ఓ వైపు హీరోగా… మరో వైపు విభిన్నమైన పాత్రలు చేస్తూ తన కెరీర్ కు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తెలుగు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా… తనకు వీలైనంతలో సేవ చేస్తూ… తాను సైతం అంటూ ముందువరసలో నిల్చుంటున్నాడు. తాజాగా పాఠశాల విద్యార్థుల మనసుల్ని చూరగొని… వారి ప్రేమకు బానిసయ్యాడు. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ కామెడీ కమర్షియల్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు సమీపంలోని అరటికట్ల గ్రామంలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి దగ్గర్లోని పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపాడు. వారి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ… రాప్ ర్యాంక్ సాధించే బాలురకు రూ.10,000, బాలికలకు 15,000 ఇస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. చదువు విషయంలో అశ్రద్ధ చూపించొద్దని… బాగా చదువుకొని మీ తల్లితండ్రులకు… దేశానికి సేవ చేయాలని ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు విద్యార్థుల్ని కోరారు.