ఓ పదేళ్ళ క్రితం మహేష్, పవన్ ల స్థాయి క్రేజ్ ఉన్న నటుడు సిద్ధార్ధ్. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు. కానీ.. కొంత కాలంగా సరైన హిట్ లేక తన ఉనికిని ఘనంగా చాటుకొనే అవకాశం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. కథ మీద నమ్మకంతో తానే నిర్మాతగా మారి తమిళంలో “చిత్తా” అనే సినిమాను నిర్మించి నటించాడు. ఈ సినిమాను మిగతా భాషల్లో విడుదల చేయడానికి అతడు పడిన ఇబ్బందులు మొన్నామధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో కన్నీటి పర్యంతమవుతూ వివరించిన విధానం అందర్నీ కదిలించింది. ఎట్టకేలకు అక్టోబర్ 6న తెలుగు, కన్నడ భాషల్లో అనువాదరూపంలో విడుదలవుతుందీ చిత్రం. తమిళనాట విమర్శకులు మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న తన వదిన (అంజలి నాయర్), ఆమె కూతురు (సహస్ర శ్రీ)తో కలిసి జీవిస్తుంటాడు ఈశ్వర్ (సిద్ధార్ధ్). ఇంటి బాధ్యతలను తన భుజాలపై మోస్తూ.. ఆనందంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బ్రతికేస్తుంటాడు. అన్నయ్య కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవడం, శక్తి (నిమిషా సజయన్)ను ప్రేమించడం, ఇంటికి కావాల్సినవి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా చూసుకోవడం. ఇలా నడుస్తుంది ఈశ్వర్ దైనందిన జీవితం.
అలాంటి సింపుల్ పర్సన్ ఈశ్వర్ మీద 8 ఏళ్ల అమ్మాయితో మిస్ బిహేవ్ చేశాడు అనే నింద పడుతుంది. అసలు సిద్ధార్ధ్ కి ఈ మిస్ బిహేవ్ కేస్ తో సంబంధం ఏమిటి? ఈ నింద కారణంగా అతడు ఎలాంటి ఇబ్బందులుపడాల్సి వచ్చింది? అసలు చిన్నారితో మిస్ బిహేవ్ చేసింది ఎవరు? అతడిని ఈశ్వర్ పట్టుకోగలిగాడా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “చిన్నా” చిత్రం.
నటీనటుల పనితీరు: తాను చేయని తప్పుకు బలైన వ్యక్తిగా సిద్ధార్ధ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. ముఖ్యంగా తన మీద పడిన నింద చెరిగినప్పుడు సిద్ధార్ధ్ కళ్ళల్లో కనిపించే సంతృప్తి, ఆ తప్పు చేసిన వ్యక్తి కోసం వెతికే ప్రయత్నంలో అతడిలో కనిపించే భావోద్వేగం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. మరీ ముఖ్యంగా మిస్ బిహేవ్ చేసిన వ్యక్తిని, తన అన్న కూతుర్ని గాలిస్తూ ఈశ్వర్ గా సిద్ధార్ధ్ చేసే ప్రయాణం చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
అలాగే.. తన అన్న కూతుర్ని హత్తుకోవడానికి ప్రయత్నించి ఆమె వెనక్కి నెట్టేసే సన్నివేశంలో సిద్ధార్ధ్ నటన “మహానది” చిత్రంలో కమల్ హాసన్ నటనను గుర్తుచేస్తుంది. నటుడిగా సిద్ధార్ధ్ తన స్థాయిని మరోమారు పరిచయం చేశాడని చెప్పొచ్చు. మలయాళ నటి నిమిషా సజయన్ కు ఈ చిత్రం అద్భుతమైన తమిళ డెబ్యూ అని చెప్పాలి. ఓ ఆధునిక మహిళగా ఆమె పాత్ర స్వభావం అద్భుతంగా పండింది. ఆ పాత్రలో ఆమెను తప్ప వేరొకర్ని ఊహించుకోలేం.
వదిన పాత్రలో అంజలి నాయర్ చాలా సహజంగా నటించింది. సిద్ధార్ధ్-అంజలి నాయర్ ల కాంబినేషన్ సీన్స్ & వారి మధ్య రిలేషన్ చాలా అద్భుతంగా వర్కవుటయ్యింది. ఇక చిన్నారి పాత్రలో నటించిన సహస్ర శ్రీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఈ పాత్ర కోసం తెలిసిన నటిని కాకుండా ఓ కొత్తమ్మాయిని తీసుకోవడం వల్ల.. చాలా నేచురల్ గా కనిపిస్తాయి సందర్భాలు, సన్నివేశాలు. స్నేహితుడి పాత్రలో నటించిన యువకుడు కూడా ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: దిబు నినన్ థామస్ పాటల్లో సోల్, విశాల్ చంద్రశేఖర్ నేపధ్య సంగీతంలో మిస్ అయ్యింది. ముఖ్యంగా చిన్నారి కనిపించే సందర్భంలో వచ్చే బీజీయమ్ సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో విఫలమైంది. ఆ కొన్ని సన్నివేశాల నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే మరోస్థాయి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. బాలాజీ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్ అని చెప్పాలి. ఓపెనింగ్ సీన్ మొదలుకొని..
ఎండింగ్ సీక్వెన్స్ వరకూ ప్రతి సన్నివేశం, సందర్భంలో ఎన్నో డైలాగులతో అర్ధమయ్యేట్లు చెప్పాల్సిన విషయాన్ని తన కెమెరా ఫ్రేమింగ్స్ తో అర్ధమయ్యేలా చేయగలిగాడు. అలాగే.. సన్నివేశంలోని మూడ్ కి తగ్గట్లు కెమెరా లైటింగ్ & టింట్ ను సెట్ చేసిన విధానం కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో తీసుకున్న కేర్ కూడా ప్రశంసనీయం. ఎమోషన్ క్రియేట్ చేసే సన్నివేశాల్లోని డెప్త్ ను అర్ధం చేసుకొనే అవకాశం ప్రేక్షకులకు ఇవ్వడం కోసం తీసుకున్న టైమ్ అండ్ వాడిన ఎఫెక్ట్స్ బాగున్నాయి. దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ గురించి చెప్పుకోవాలి. అతడి మునుపటి సినిమాలు సేతుపతి కూడా యాక్షన్ ఫిలిమ్ అయినప్పటికీ.. మంచి థ్రిల్ ఉంటుంది.
“చిన్నా” విషయంలోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. ఎమోషనల్ జర్నీ అని ఇంటర్వెల్ కి ఫిక్స్ అయిన ప్రేక్షకులకు సెకండాఫ్ లో తెగ టెన్షన్ పెట్టాడు. ఒకానొక సందర్భంలో ఇది థ్రిల్లర్ సినిమా ఏమో అనిపిస్తుంది. అలాగే.. సమాజంలో జరుగుతున్న కొన్ని జుగుప్సాకరమైన విషయాలను ఎలాంటి షుగర్ కోట్ చేయకుందా.. చాలా నేరుగా వివరించిన విధానం అభినందనీయం. అదే సందర్భంలో ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్ట్రయిట్ గా చెప్పాడు అరుణ్ కుమార్. ఒక దర్శకుడిగా, కథకుడిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా తన బాధ్యతను చాటుకున్నాడు.
విశ్లేషణ: చైల్డ్ ఎబ్యూజ్ కాన్సెప్ట్ తో ఇప్పటికే పలు చిత్రాలొచ్చాయి. రీసెంట్ గా “గార్గి” కూడా వచ్చింది. అయితే.. సీరియస్ గా ఒక సోల్యూషన్ మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. కాకపోతే.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం హైలైట్ చేస్తూ వచ్చారు. ఆడపిల్లల తల్లిదండ్రులు అనే కాదు..
ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా “చిన్నా”. కాన్సెప్ట్ ఎంత హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందో.. కథనం అంత ఆసక్తికరంగా ఉంటుంది. సిద్ధార్ధ్ నటన, స్క్రీన్ ప్లే & కోర్ పాయింట్ కోసం సినిమాను కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే!
రేటింగ్: 3/5
Rating
3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus