దివంగత మహానటి సావిత్రికి (Savitri) , ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మధ్య చక్కటి అనుబంధం ఉండేది అని నాటి సినీ జనాలు చెబుతుంటారు. ఇద్దరూ కలిస్తే… సెట్‌లో భలే సందడిగా ఉండేదని.. చిరు అంటే ఆమె ఎంతో వాత్సల్యం చూపించేవారు అని అనేవారు. ఈ విషయం గురించి ఇటీవల చిరంజీవే చెప్పారు. గతంలో తామిద్దరి మధ్య జరిగిన అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. చిరంజీవి తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లో సావిత్రితో ఆయన కలసి నటించిన విషయం తెలిసిందే.
సావిత్రితో కలసి నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించిందని చెప్పి చిరంజీవి… రాజమండ్రిలోని పంచవటి హోటల్‌లో ఉన్న సావిత్రిని పరిచయం చేసేందుకు తనను తీసుకెళ్లారని ఆ రోజు గురించి చెప్పుకొచ్చారు. సావిత్రిని చూడగానే నోట మాట రాలేదని, ఆమె ‘నీ పేరేంటి బాబు’ అని అడిగితే తేరుకుని ‘చిరంజీవి’ అని అన్నాను అని వాళ్లిద్దరి మధ్య జరిగిన తొలి పరిచయం గురించి చెప్పారు మెగాస్టార్. అయితే ఆ మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయిందట.
అక్కడ చిరంజీవి సరదాగా డ్యాన్స్ జారిపడ్డారట. అలా పడిపోయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టారని, అప్పుడు సావిత్రి ‘నువ్వు భవిష్యత్‌లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పారట. అప్పుడు చిరంజీవికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించిందట. సావిత్రి చప్పట్లు కొడుతుంటే చాలా గర్వంగా అనిపించిందని తెలిపాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ‘ప్రేమ తరంగాలు’ సినిమాలో సావిత్రి కొడుకుగా నటించానని చెప్పారు.
అయితే ఆ తర్వాత మళ్లీ కలసి నటించే అవకాశం కానీ.. చూసే చాన్స్ కానీ రాలేదని చెప్పారు చిరు. మా నాన్నకి సావిత్రి అంటే ఎంతో అభిమానం. ఆయనతో కలసి ఆమె సినిమాలు చూశాను అంటూ పాత రోజుల గురించి చెప్పారు చిరు. ఆమెతో రెండు సినిమాలే చేసినా.. నటన పరంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ సావిత్రి మీద ఆయనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు చిరు.