మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడి భక్తుడు అనే విషయం తెలిసిందే. ఎన్నో సార్లు ఆయన ఈ విషయం చెప్పారు. ఇప్పుడు అదే కారణంతో ‘హను – మాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా వచ్చారు. అయితే ఆయనెందుకు హనుమంతుడి భక్తుడు అనేది మాత్రం ఇన్నాళ్లూ తెలియదు. ఎలా అయ్యాడు అనేది కూడా తెలియదు. అయితే ఈ విషయాలను ‘హను – మాన్’ ఈవెంట్‌లో పూర్తిగా చెప్పారు చిరు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ తొలుత తన నోటి నుండే వచ్చింది అని కూడా తెలిపారు.
తొలుత టైటిల్ సంగతి తేల్చేద్దాం. ఆ తర్వాత చిరు భక్తుడు ఎలా అయ్యాడో చూద్దాం. కొన్ని నెలల క్రితం చిరంజీవి ఓ టాక్ షోకి వెళ్లినప్పుడు హోస్ట్ మీకు ఏ సూపర్ హీరో అంటే ఇష్టం అని అడిగారు. దానికి చిరు మనకు ‘హను మాన్’ ఉన్నాడు కదా. ఆయనే తన సూపర్ హీరో అని చెప్పాడు. ఆ మాట నుండే ఇప్పుడు ‘హను – మాన్’ టైటిల్ వచ్చింది అని చెప్పారు చిరు. ఆ షో సమంత హోస్ట్ చేసిన ‘సామ్ జామ్’ అన్నట్లు గుర్తు.
ఇక చిరు – ఆంజనేయుడు కథ చూస్తే… చిన్నప్పుడు చిరు కుటుంబంలో ఎవరూ ధైవ భక్తులు లేరట. నాన్న కమ్యూనిస్ట్ కావడంతో దేవుణ్ని పెద్దగా నమ్మేవారు కాదట. అయితే అమ్మ ఒత్తిడితో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే వాళ్లట. అలా పొన్నూరులో ఏడో తరగతి చదువుకునే సమయంలో ఆంజనేయస్వామి గుడి ఉండేదట. రోజూ దండం పెట్టుకుని వచ్చేవాడట చిరు. 8వ తరగతి బాపట్లలో చదువుకున్నాడట. అక్కడ కూడా ఆంజనేయుడి గుడి ఉండేదట. సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లొచ్చేటప్పుడు ఆ గుడి వద్ద ప్రసాదం ఇచ్చేవారట. దాని కోసం వెళ్లీ వెళ్లీ ఆంజనేయుడిపై భక్తి ఏర్పడిందని చెప్పారు.
మొగల్తూరులో చదువుకునే సమయంలో రోడ్డుపై మిఠాయి కొంటే హనుమంతుడు క్యాలెండర్ బహుమతిగా ఇచ్చారట. ఆ బొమ్మ ఇప్పటికీ తన ఇంట్లో ఉందట. ఆ తర్వాత పదో తరగతి చదివే సమయంలో తన తండ్రికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని, అక్కడికి వెళ్లడం ఇష్టం లేక లాంగ్ లీవ్ పెట్టారట. ఆ సమయంలో ఒత్తిడిగా అనిపించడంతో హనుమాన్ ఛాలిసా చదవమని సలహా ఇచ్చాడట చిరు. తండ్రి కాస్త సంకోచించినా చదివాక తను ఉన్న ఊరికే జాబ్ ట్రాన్స్ ఫర్ అయ్యిందట.
ఆ సమయంలో ఆంజనేయుడిపై తన తండ్రికి నమ్మకం కుదిరిందని చెప్పారు చిరు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలని చిరు మద్రాసు వెళ్లాలని అనుకున్న సమయంలో ఇంటి పెరట్లో ఆంజనేయ స్వామి బొమ్మ దొరికిందట. దాన్ని మెడలో లాకెట్ చేసి వేసుకున్నారట. ఆ తర్వాత తనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి అని చెప్పారాయన. అలా ఓ సారి మద్రాసులోని డబ్బింగ్ స్టూడియోలో ఆ లాకెట్ మిస్ అయ్యిందట. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆ స్టూడియోకే వెళ్లే అక్కడే మళ్లీ దొరికిందట.
తాను ఇన్నేళ్లలో ఎప్పుడూ లాకెట్ తీయలేదట. కానీ ‘అన్నయ్య’ సినిమా షూటింగ్‌లో ఆ లాకెట్ తీసేయాల్సి వచ్చిందట. తీసి పక్కనే ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చానని కానీ ఆ తర్వాత అతను తనకు ఇవ్వలేదట. అతని కోసం ఎంత వెతికినా దొరకలేదట. దీంతో దేవుడిపై భక్తి మనసులో ఉండాలి, గొలుసులో కాదు, ఆ విషయం తెలియడానికి తనకు ఇంత టైమ్ పట్టింది అని అనుకున్నారట చిరు. అప్పటి నుండి ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా హనుమంతుడితో మనసులోనే మాట్లాడతానని, ఆ తర్వాత పరిష్కారం దొరుకుతుందని చిరు (Chiranjeevi) చెప్పారు. తన జీవితం ఇంత విజయవంతంగా ఉండటానికి ఆ హనుమంతుడే కారణం అని చిరు చెప్పారు.