టాలీవుడ్ నేడు ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. విలక్షణ నటుడిగా విభిన్న పాత్రలు చేసిన జయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పొందారు. నేడు ఉదయం ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. లాక్ డౌన్ మొదలైన నాటి నుండి జేపీ గుంటూరులో ఉంటున్నారు. నేడు ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు ధ్రువీకరించడం జరిగింది. కాగా జేపీ హఠాన్మరణాన్ని టాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు జేపీ మరణం తీరని లోటని ఆయనను స్మరించుకుంటున్నారు.
అలాగే జేపీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా జేపీ మరణంపై స్పందించారు. ఓ గొప్ప నటుడిని తెలుగు పరిశ్రమ కోల్పోయిందని ఆయన ఆవేదన చెందారు. అలాగే జేపీతో తనకు గల అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. జేపీ గారు ఎప్పుడూ నాటకరంగం తనను కన్నతల్లి అని సినిమా రంగం పెంచిన తల్లి అని చెవుతూ ఉండేవారట.
అందుకే సినిమాలతో ఎంత బిజీగా ఉన్న శని, ఆదివారాల్లో నాటకాలు ఆడుతూ ఉండేవారట. తమ నాటక ప్రదర్శకు మీరు రావాలని జేపీ ఓ సంధర్భంలో చిరంజీవిని కోరారట. ఐతే చిరంజీవికి మాత్రం ఆయన నాటక ప్రదర్శనకు హాజరయ్యే వెసులుబాటు కలగలేదట. జేపీ కోరిక నేను తీర్చలేకపోయానని చిరు పరోక్షంగా తన బాధను తెలియజేశారు.