మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఘనంగా జరిగింది. కాకపోతే చివర్లో వర్షం ఎక్కువయ్యి అందరినీ ఇబ్బంది పెట్టింది. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తే ముందుగానే స్టార్ హీరోలు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోతారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం వర్షంలో తడుస్తూనే స్పీచ్ ఇచ్చారు. అంతేకాదు చిత్ర బృందం అందరి గురించి ఆయన స్పీచ్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.
‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఆ నేల తడుస్తుంది. ఇంద్ర సినిమా షూటింగ్లో భాగంగా వరుణ దేవుడికి ప్రార్థించిన రోజులు గుర్తుకొచ్చాయి. రాజకీయాల ప్రచారంలో భాగంగా కూడా వర్షం వచ్చింది. ఇది ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను’ అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు చిరంజీవి. అటు తర్వాత “రాంచరణ్ వల్లే నేను ఈ సినిమా చేశాను. నాకు ఉన్న ఇమేజ్ కు ఈ కథ కచ్చితంగా సూట్ అవుతుంది అని చెప్పాడు. దర్శకుడిగా ‘ధృవ’ ఒరిజినల్ అయిన ‘తనీ ఒరువన్’ ను తీసిన మోహన్ రాజా ని తీసుకుందాం అని చెప్పాడు.
అతని సెలక్షన్ సూపర్ అనిపించింది. దర్శకుడివి చిన్న కోరికలు కాదు. నా పక్కన సల్మాన్ కావాలి అన్నాడు. సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటాడా అనే అనుమానం నాకు వచ్చింది. కానీ చరణ్ ఒక్క ఫోన్ చేయగానే సల్మాన్ ఓకే చెప్పేశాడు. నయన తార, పూరి జగన్నాథ్.. వంటి స్టార్లను కూడా తీసుకురావడం జరిగింది.అలాగే సత్యదేవ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. కచ్చితంగా అతను భవిష్యత్తులో సూపర్ స్టార్ గా ఎదిగాడు.
సునీల్, అనసూయ అందరూ చాలా బాగా చేశారు” అంటూ చిరు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా గుర్తుచేసుకున్నారు. లిరిసిస్ట్ లు, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్.. ఇలా ఎవ్వరినీ ఆయన మర్చిపోలేదు.అలాగే అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్న ‘ఘోస్ట్’, ‘స్వాతి ముత్యం’ చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి ఆ సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాలి అని కోరుకుంటున్నాను. చివర్లో ‘ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్టులు.. ఇసుక కాంట్రాక్టులు.. కొండ కాంట్రాక్టులు.. నీళ్ల కాంట్రాక్టులు.. నేల కాంట్రాక్టులు..
మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన.. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం.. తప్పు చేయాలంటే భయం తప్ప మీ మనసులో ఏది ఉండకూడదు. ఏదైనా జరగకూడదని జరిగిందో.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబడ్దార్’ అంటూ ఓ పవర్ డైలాగ్ ను కూడా చెప్పారు చిరు.