ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు ఎంత ఉండాలో.. డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ లలో ప్రీమియర్ సీట్ల టికెట్ రేట్లు రూ.250 మాత్రమే ఉండాలి. మిగతా టికెట్లు రూ.150, 100 ఉండాలని నిర్ణయించారు. దీనిపై తెలుగు సినిమా ఇండస్ట్రీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ”పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం.
అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది” అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.