చిరంజీవి తాను స్థాపించిన “ప్రజారాజ్యం” పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పట్నుంచి అన్నదమ్ములైన చిరు-పవన్ కళ్యాణ్ ల నడుమ రిలేషన్ బాగోలేదని, ఇద్దరికీ పడట్లేదు అని తెలుగులో ఒక పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ మీడియా మరియు కొన్ని నేషనల్ మీడియా హౌస్ లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై ఒకసారి చరణ్ స్పందిస్తూ.. “ఈ ప్రచారాలన్నీ నాకు వెంట్రుకతో సమానం” అని కాస్త గట్టిగానే స్పందించాడు. అందుకు కారణం పవన్ కళ్యాణ్-చిరంజీవి ఒకే దగ్గర కనిపించకపోవడం. అయితే.. “సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చిన తర్వాత కూడా ఆ గాసిప్పులు ఆగలేదు.
ఇదే విషయమై సైరా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన చిరంజీవిని అడగగా.. “నిజానికి ఈ వార్తలు నేను, పవన్ కళ్యాణ్ చదివి నవ్వుకుంటూ ఉంటాం. మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు అని ప్రపంచాన్ని నమ్మించడం కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదం. అయితే.. కొన్ని నేషనల్ మీడియా హౌజ్ లు కూడా ఈ వార్తల్ని ప్రసారం చేయడం మాత్రం కాస్త బాధించింది కానీ.. ఇవన్నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. తమ్ముడు స్వంత పార్టీ పెట్టుకున్నందుకు నిజానికి నేను గర్వించాను. వాడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. వాళ్ళకి అండగా నిలుస్తాడు” అని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు మెగాస్టార్.