టాలీవుడ్లో రేగిన కొత్త ముసలాన్ని క్లియర్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై కొనసాగుతున్న సందిగ్ధతను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య సఖ్యత కుదరడం లేదనే విషయం తెలిసిందే. దీంతో తెలుగు చిత్ర నిర్మాతలు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి వద్దకు వెళ్లారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సుప్రియ యార్లగడ్డ, చెర్రి, కేఎల్ నారాయణ, సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్‌తో చిరంజీవి తన ఇంట్లో సమావేశమయ్యారు.
సినిమా కార్మికుల డిమాండ్లు, నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాల్ని నిర్మాతలందరూ చిరంజీవికి వివరించారు. సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో పరిస్థితులు చక్కబడకపోతే ఈ విషయంలో తాను జోక్యం చేసుకుంటానని నిర్మాతలకు చిరంజీవి హామీ ఇచ్చినట్లు తెలిపారు. చిరంజీవికి మా సమస్యను వివరించామని, అకస్మాత్తుగా చిత్రీకరణలు ఆపడం బాధాకరమైన విషయమని తెలిపామని సి.కల్యాణ్ చెప్పారు. మీ సమస్యలు మీరు చెప్పారు.. కార్మికుల వెర్షన్‌ను కూడా తెలుసుకుని మాట్లాడాతనని నిర్మాతలకు చిరంజీవి చెప్పారట.
చిన్న సినిమా నిర్మాతలు, యూనియన్ నాయకులతో బుధవారం మరోసారి సమావేశమై చర్చిస్తామని సి.కల్యాణ్ వివరించారు. సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రాని కల్లా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కార్మిక శాఖ అదనపు కమిషనర్‌తో మంగళవారం ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, సమావేశమై తమ సమస్యల్ని వివరించారు. ఈ సందర్భంగా లేబర్ కమిషన్ పర్సెంటేజీ ప్రతిపాదన చేయగా ఒప్పుకోలేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలియజేశారు. దీంతో ఈ విషయంలో ఈ రోజు సాయంత్రంలోగా విషయం తేలనుంది.. లేదంటే చిరంజీవి రంగంలోకి దిగుతారు. చూద్దాం మరి చాలా రోజుల తర్వాత చిరంజీవి నాయకుడి అవతారం ఎత్తారు. ఎలాంటి రియాక్షన్ ఉంటుందో?